కిరికిరి కమిటీలు..ఇంకా ఎందుకో!
► మితిమీరిన జన్మభూమి కమిటీల ఆగడాలు
► ఐదు నెలల క్రితమే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
► మిత్రపక్షం బీజేపీ నుంచీ అసంతృప్తి సెగలు
► ప్రవేశపెట్టిన అధికార పార్టీకే మైండ్‌బ్లాక్
► సలహాలకే పరిమితం చేస్తానంటున్న సీఎం
► ఇప్పటికైనా రద్దు చేయాలని ప్రజల డిమాండు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలు జన్మభూమి కమిటీలు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నుంచి పంపిణీ వరకూ అన్ని వాటి సిఫారసులతోనే చేయాలని జిల్లా అధికారులకు గత ఏడాది ఆదేశాలిచ్చిన ఘనత ఆయన ప్రభుత్వానిదే. ఇప్పుడు అవి హద్దులు దాటాయని, అధికారాలు తీసేసి సలహాలకే పరిమితం చేయాలని ఈ నెల 2న విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం అన్నారని చెబుతున్నారు.
ఎన్నికల్లో గట్టెక్కడానికి సహాయం చేసిన తమనే జన్మభూమి కమిటీలు లెక్క చేయట్లేదని, ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాయని మిత్రపక్షం బీజేపీ.. సోమవారం విజయవాడలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మండిపడింది. అసలు ఈ జన్మభూమి కమిటీలే ఓ మాదిరి కిరికిరి కమిటీలని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ అధికారాలను కాదని, వాటికే పవర్ కట్టబెట్టడమేమిటని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకూ తొలి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి ఉపయోగపడతాయని భావించిన జన్మభూమి కమిటీలు ప్రస్తుతం భస్మాసుర హస్తంలా మారడంతో అధికార పార్టీ ఆలస్యంగా మేల్కొంటున్నట్టుంది. ఈ కమిటీలు హద్దులు దాటిపోయయని, వాటిని సలహాలకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారట! ఇంత జరుగుతున్నా ఈ కమిటీలను రద్దు చేస్తామని చెప్పడం మానేసి, ఇంకా వాటిని కొనసాగించాలని చూడటం ఎంతవరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రైతు రుణమాఫీ నుంచి నిరుద్యోగ భృతి వరకూ, లిక్కర్ పాలసీ నుంచి ఇసుక విధానం వరకూ ప్రతి అంశం అమల్లోనూ టీడీపీ ప్రభుత్వం బొక్కబోర్లా పడుతోందని.. ముందు తమవే మంచి విధానాలని చెప్పుకొని తర్వాత నాలుక కరుచుకోవడం అలవాటైపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జన్మభూమి కమిటీలు కూడా ఇదే కోవలో చేరాయని అంటున్నారు.
ఎందుకీ జన్మభూమి కమిటీలు?
పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ, ఇంటిపట్టా నుంచి పక్కా ఇల్లు వరకూ, మరుగుదొడ్డి నిర్మాణం నిధుల నుంచి బ్యాంకు రుణం వరకూ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేస్తేనే అధికార ముద్ర పడుతుంది. టీడీపీ ప్రభుత్వం అనాలోచితంగా కట్టబెట్టిన ఈ రాజ్యాంగేతర అధికారాలవల్ల బిల్లు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకూ, చివరకు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి! అయినప్పటికీ ఇటీవలే పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలోనే కాదు పింఛన్ల పంపిణీలోనూ జన్మభూమి కమిటీలకే అధికారాలు కట్టబెడుతూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతరశక్తులుగా తయారయ్యాయని పేర్కొంటూ, వాటికి ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాలను సవాలు చేస్తూ ఇప్పటికే జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
పథకాలపై సర్వాధికారం
ఏ ఆధారమూ లేని వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ఇచ్చే పింఛనుకు అర్హులైనవారిని ఏడాదిన్నర క్రితం వరకూ గ్రామపంచాయతీల పరిధిలోనే ఎంపిక చేసేవారు. ప్రస్తుతం జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసుతోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఇటీవలి ఉత్తర్వుల ఫలితంగా జన్మభూమి కమిటీ సభ్యులు వేలిముద్ర వేయకుండా లబ్ధిదారులు తమ పింఛను మొత్తాన్ని తెచ్చుకోలేరు. పారదర్శకత పేరుతే ప్రభుత్వం చేస్తున్న ఈ పనులవల్ల పింఛనుదారులు ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్నిచోట్ల లబ్ధిదారులకు అందే కొంత మొత్తంలోనూ జన్మభూమి కమిటీ సభ్యులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గతంలో ప్రాతినిధ్యం వహించిన తుని నియోజకవర్గంలోనే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే సాకుతో పింఛన్ల నుంచి రూ.100 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకించినవారివి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలవి కలిపి ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 5,472 పింఛన్లు తొలగించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చివరకు చంద్రన్న కానుక సరుకులను కూడా రేషన్ డీలర్లు కాకుండా జన్మభూమి కమీటీ సభ్యులు పంపిణీ చేస్తున్నారు.
ఒకప్పుడు ఇళ్లస్థలాల లబ్ధిదారుల ఎంపిక అర్హతే ప్రాతిపదికగా జరిగేది. కానీ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల దరఖాస్తులకే జన్మభూమి కమిటీ సభ్యులు ఆమోదం తెలుపుతున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరకు వారు సిఫారసు చేస్తేనే ఇంటి రుణం మంజూరవుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలు కూడా జన్మభూమి కమిటీలు సిఫారసు చేసినవారికే ప్రస్తుతం మంజూరవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని వారు డిమాండు చేస్తున్నారు.