బంగారు కొండ
సాయి పాపినేని పదం నుంచి పదం లోకి-4
సువర్ణగిరి - మౌర్యసామ్రాజ్యపు దక్షిణదేశ రాజధాని (నేటి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామం) - క్రీ.పూ. 256
కళింగ దండయాత్ర అఖండ విజయంతో ముగిసింది. బడలిక తీరిన మౌర్యసామ్రాజ్య చక్రవర్తి అశోకుడు తన దక్షిణ రాజధాని సువర్ణగిరికి రేపు రానున్నాడు. చక్రవర్తి ఆగమనానికి చేయవలసిన సన్నాహాలతో మహామాత్ర (గవర్నర్) ధర్మతేజుడు తలమునకలుగా ఉన్నాడు. ఇంతలో అత్యవసర న్యాయస్థానాన్ని హాజరు పర్చాలని రాజకుని (తహసిల్దార్) కోరిక. ఏదో దొంగతనం విచారణ. బహుశా బంగారం దొంగతనమే అయి ఉండాలి.
సువర్ణగిరి ప్రాంతం బంగారు, వజ్రపు గనులకి ప్రసిద్ధి. ప్రతియేటా మణుగులకొలదీ బంగారం, వజ్రాలు ఏనుగులపై మగధకి రవాణా అవుతాయి. కోటలోని లోహ కర్మాగారం భారతదేశంలోనే అతి పెద్దది. దాని కర్మాంతికుడు (ఫ్యాక్టరీ సూపరింటెండెంట్) దమనదత్తుడు. నగరంలోని ఇతర ముఖ్యోద్యోగులు గనుల సంస్థానాధ్యక్షుడు (చీఫ్ మేనేజర్ మైన్స్), నగర వ్యవహారికుడు (మేజిస్ట్రేట్), ప్రాదేశికుడు (సిటీ కమిషనర్), దండపాలుడు (పోలీస్ ఇన్స్పెక్టర్) అందరూ కోట మధ్యలోని మైదానం వద్ద ఉన్నతాసనాలతో ముందుగానే వచ్చి కూర్చున్నారు. పట్టణంలో పౌరులు చోద్యం చూసేందుకు చుట్టూ గుమికూడారు. ధర్మతేజుడు అగ్రపీఠం అధిష్టించిన మరుక్షణమే భటులు నిందితుడు కాపడిని పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకు వచ్చి మైదానం మధ్యలో పడవేశారు.
‘నిందితునిపై అభియోగం?’ ధర్మతేజుడు అడిగాడు.
దమనదత్తుడు లేచి ‘ఆర్యా, ఇతడి పేరు కాపడు. కృష్ణాతీరంలోని బంగారు గనులలో పనిచేసే గణకుడు(అకౌంటెంట్). ఇతడు బంగారం శుద్ధిచేసే కర్మాగారంలో అనుమతి లేకుండా ప్రవేశించి బంగారం దొంగిలించి పారిపోతుండగా మన రక్షకదళం బంధించింది. ఇందులో విచారించేందుకు ఏమీ లేదు. తమరు తగిన దండన విధించగలరు’ అన్నాడు. ‘ఇది సామాన్యమైన దొంగతనం. నిందితుడిని నగర వ్యవహారికుడే దండించవచ్చు కదా? ప్రత్యేక న్యాయస్థానం దేనికి?’
కాకవర్ణుడు లేచాడు. అతడు గనుల సంస్థానాధ్యక్షుడు,
‘ఆర్యా, ఈ అపరాధాన్ని చిన్న దొంగతనంగా పరిగణించవద్దు. కౌటిల్యుని దండనీతి ప్రకారం కర్మాగారంలో అనుమతి లేకుండా ప్రవేశించిన వారికి మరణదండనే తగిన శిక్ష. నా అనుభవంలో ఇటువంటి నేరం ఇదే మొదటిసారి. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి భవిష్యత్తులో మరొకరు ఇటువంటి నేరానికి పాల్పడకుండా కఠినమైన దండన విధించమని అర్థిస్తున్నాను’ అని తన వాదన వివరించాడు కాకవర్ణుడు.
‘ఊ.. మరణదండన’ అని కాసేపు ఆలోచించి నిందితుడు కాపడి వంక చూసి ‘ఏమోయ్, నీపై అభియోగం విన్నావు కదా? నీవేమైనా చెప్పుకోవలసినది ఉందా?’ అని అడిగాడు ధర్మతేజుడు.
‘అయ్యా! నేను నిరపరాధిని. గనుల కార్యాలయంలో గణకునిగా కొన్ని అవకతవకలు నా దృష్టికి వచ్చాయి. వాటిని రహస్యంగా ఇక్కడి గనుల సంస్థానధ్యక్షునికి విన్నవించేందుకు వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక దండపాలుడు నాపై ఈ లేనిపోని అభియోగం మోపటంతో దిక్కు తోచక పారిపోబోయాను. అంతే’... అన్నాడు కాపడు. కాపడి మాటలలో ధర్మతేజుడికి కపటం కనిపించలేదు.
‘ఆర్యా’ అంటూ లేచాడు నగర వ్యవహారికుడు. ‘కాపడు అబద్ధం చెబుతున్నాడు. దండపాలుడు గని అధికారులందరితో విచారించాడు. ఎక్కడా అవకతవకలు లేవు. ఇతడు దొంగ. చేతికందిన బంగారంతో కుటుంబం వద్దకు పారిపోవటమే అతడి ఉద్దేశ్యం అని విచారణలో తేలింది’ అని తన నివేదిక వివరించాడు. హుమ్! ఇక విచారించేందుకు ఏమీలేదు. ఇతడికి శిరచ్ఛేధమే శిక్ష. మూడు దినాల వ్యవధి తరువాత దండపాలుడు శిక్ష అమలు చేయవచ్చు’ అని లేవబోయాడు ధర్మతేజుడు.
‘ఆర్యా! మాదొక మనవి. రేపు చక్రవర్తి విచ్చేస్తున్నారు’ అని అడ్డుపలికాడు కాకవర్ణుడు. ‘ఆ ఉత్సవాల మధ్య శిక్ష అమలు చేయటం అనుచితమేమో. తమరు అనుమతిస్తే ఈ సాయంత్రమే... ‘వీలుకాదు. అది దండనీతికే విరుద్ధం. మరణశిక్ష విధించిన వ్యక్తికి లేదా అతడి సన్నిహితులకి కొత్త సాక్ష్యాలు, వాదనలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వటం ఆనవాయితీ. ఈ విషయంలో నేను ధర్మం తప్పి మీరు కోరినట్లు అనుమతి ఇవ్వలేను. చక్రవర్తి ఇక్కడ ఉండగా శిక్ష అమలు చేయటానికి మీకు అభ్యంతరమైతే వారు వెళ్లిన తర్వాతే అమలు చేయవచ్చు. అంత వరకు ఇతడిని కారాగృహంలో నిర్బంధించండి’ అని నిష్ర్కమించాడు ధర్మాధికారి ధర్మతేజుడు.
‘అలాగే కానిస్తే సరి. ఎన్నాళ్లైనా సాక్ష్యం చెప్పేందుకు ముందుకొచ్చే ధైర్యమెవరికి?’ కాకవర్ణుని చెవిలో గుసగుసలాడాడు దమనదత్తుడు.
‘ఏదియేమైనా చక్రవర్తి వెళ్లే వరకూ వర్తకపు బిడారులు ఈ చుట్టుపక్కలకి రాకుండా చూడాలి. మన గుట్టు రట్టయిందంటే పీకల మీదకి వస్తుంది’ అని బదులుపలికాడు కాకవర్ణుడు.
చక్రవర్తి వచ్చి వారం గడిచింది. గనుల పర్యవేక్షణకి విచ్చేస్తున్నారని ఏ రోజుకారోజు వార్త. కానీ ఏదో ఒక నెపంతో వాయిదా పడుతూనే ఉంది. కాకవర్ణునికి గనులని వదిలి వచ్చేందుకు వీలుపడటం లేదు. ఇంతలో పిడుగులాంటి వార్తతో పరిగెత్తుకు వచ్చాడు దమనదత్తుడు. ‘కాపడి మరణదండన విషయమై ఏదో కొత్త సాక్ష్యమట. ధర్మతేజుడు న్యాయస్థానాన్ని హాజరు పరిచాడట, తమరు వెంటనే రావాలి.’
ఊరంతా పారమైదానంలో హాజరైంది. వారికి తోడు చోద్యం చూడటానికి చక్రవర్తి మూలబలంలోని సైనికులు. ధర్మతేజుడు ఆసీనుడయిన మరుక్షణం నల్లగా బవిరిగడ్డంతో ఉన్న ఆగంతకుడు ఒకడు పౌరులలో నుండి వచ్చి మైదానం మధ్య నిలిచాడు. ‘మహామాత్రా. నేను పరదేశిని, నిందితుడు కాపడు నాకెంతో సన్నిహితుడు. అతడు నిరపరాధి అని నిరూపించే కొన్ని సాక్షాలు ప్రవేశపెట్టడానికి తమ అనుమతి కోరుతున్నాను’ అంటున్న ఆగంతకుడి కంఠం న్యాయస్థానం నలుదిశలా మార్మోగింది. వెంటనే కాకవర్ణుడు లేచాడు.
‘ఆర్యా! ఇతడొక తోడుదొంగ. వెంటనే బంధించండి’ అంటున్న అతణ్ణి వారిస్తూ
అదే నిజమైతే అలాగే చేద్దాం. ముందుగా అతడిని మాట్లాడనివ్వండి’ అన్నాడు ధర్మతేజుడు.
‘ఏమయ్యా పరదేశీ. నీ వాంగ్మూలం సెలవీయవచ్చు’ అన్నాడు ఎంత దాచినా దాగని ముసి ముసి నవ్వులతో.
‘మహామాత్రా! కాపడు నిరపరాధి. ప్రభుత్వ గనుల నుండి కర్మాగారం నుండి అక్రమంగా బంగారం విలువైన రత్నాలు రవాణా అవుతున్నమాట నిజం. గని అధికారి దీనిలో భాగస్వామి. అతడే కాదు ఈ న్యాయస్థానంలో ఉన్నతాసనాలపై కూర్చొన్న పలువురు పెద్దలు కూడా..’
‘
అప్రస్తుతం!’
‘వీడిని పట్టి బంధించండి!’
‘సాక్ష్యం ఏది?’
ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది. కనుమూసి తెరిచేంతలోగా ఎక్కడ నుంచి వచ్చారో సైనికులు ఆ ప్రముఖుల పక్కనే నిలిచి వారిపై కత్తులు దూశారు. మెల్లిగా న్యాయస్థానంలో నిశ్శబ్దం ఆవరించింది. ఇంతలో కొందరు సైనికులు నలుగురు మనుషులని మైదానంలోకి ఈడ్చుకువచ్చి వారి ముఖాలపైనున్న ముసుగులు విప్పారు. వారిని చూడగానే నగర ప్రముఖుల ముఖాలు నెత్తురు చుక్కలేకుండా పాలిపోయాయి . వారు బిడారు వర్తక సంఘాల నాయకులు. అక్రమ బంగారాన్ని అనధికారంగా కొని తీసుకెళుతున్న ప్రబుద్ధులు. వారికి సహకరిస్తున్న నగర ప్రముఖుల గుట్టు బట్టబయలైంది. దమనదత్తుని మాటలు తడబడ్డాయి.
‘ఇఇ ఇంతకీ ఎవరివోయి నీవు?’ అని అడిగాడు ఆగంతకుడిని.
బవిరిగడ్డంలో మైదానం మధ్య నవ్వుతూ నిలిచి ఉన్న ఆ ఆగంతకుడు ‘ఆహ్హహ్హహ్!’ అని నవ్వుతూ తన పెట్టుడు గడ్డం తీశాడు.
జనం మధ్యలో ప్రత్యక్షమైన చక్రవర్తి అశోకుడి నిజరూపం చూసి ధర్మతేజుడు తప్ప మిగిలిన వారంతా కొయ్యబారిపోయారు.
అశోకుడు: ఎర్రగుడి శాసనాలు...
భారతీయ సెక్యులర్ న్యాయ సిద్ధాంతాలకి ప్రతీక అశోకుడు. మన జాతీయ జెండాలోని ధర్మచక్రం అతడి భవిష్య దృష్టికి చిహ్నం. ఆంధ్ర దేశంలో కూడా ఆర్థిక న్యాయవ్యవస్థలకి పునాది అశోకుని కాలంలోని వేయబడింది.
నేటి ఆంధ్ర, కర్నాటక సరిహద్దు ప్రాంతంలో బంగారం తవ్వి తీసిన ఆధారాలు ఇప్పటికీ 5 వేల సంవత్సరాల ముందు రాతియుగం నుంచి కనిపిస్తాయి. కోలార్, హుట్టి బంగారు గనులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడ పారే చిన్నా పెద్దా నదులలోని ఒండ్రుమట్టి నుంచి కూడా బంగారం వడగట్టి వెలికి తీసేవారు. సువర్ణగిరి, కనకగిరి వంటి అశోకుని శాసనాలు దొరికిన ప్రదేశాల పాత పేర్లు కూడా ఈ లోహంతో గల సంబంధాన్ని తెలియజేస్తాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఖనిజాలని తవ్వితీసే పరిశ్రమ గురించి విశదంగా వివరిస్తుంది. అశోకుని శాసనాలని, అర్థశాస్త్రాన్ని పరిశీలిస్తే ఆనాటి వ్యవస్థలోని రాజోద్యోగుల డిజిగ్నేషన్లు, వారి వారి బాధ్యతలు, జీతాల వివరాలు దొరుకుతాయి. ప్రభుత్వ కర్మాగారాలు, వాటి పనితీరు, అధికారులలో అవినీతి, వాటికి తగిన శిక్షల గురించి అనేక వివరణలు ఉన్నాయి.
న్యాయవ్యవస్థ, న్యాయస్థానాలు పనిచేసే విధానం (జ్యూరిస్ప్రుడెన్స్) రోమన్ సామ్రాజ్యం ప్రపంచానికి ఇచ్చిన వారసత్వం అని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. సిసిరో, జూలియస్ సీజర్ మొదలైన రోమన్ ప్రముఖులు ఎందరో న్యాయవాద వృత్తిలో రాణించిన తరువాతే రాజకీయాలలో ఎదిగారు. భారతీయ స్వాతంత్య్ర సమరంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్ మొదలైన వారంతా మొదట్లో న్యాయవాదవృత్తి చేసినవాళ్లే. న్యాయవ్యవస్థకి, రాజకీయాలకి విడదీయరాని సంబంధం ఈనాటిది కాదు. రోమన్ సామ్రాజ్యం స్థాపనకి ముందే న్యాయవ్యవస్థని, సిద్ధాంతాలని నిర్దేశించిన గ్రంథాలు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం ఆనాడు దేశంలో ఉన్న పటిష్టమైన న్యాయవ్యవస్థని తెలియజేస్తుంది.
భారతదేశంలో న్యాయశాస్త్రానికి మౌలికమైన గ్రంధం మనుధర్మశాస్త్రం. అన్నింటిలో ప్రప్రథమమైన ఆపస్తంభ ధర్మశాస్త్రం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పరిసరాలలో గోదావరి తీరంలో క్రీ.పూ. 6వ శతాబ్దంలో రచించబడింది. ఆంధ్రదేశంలో సువర్ణగిరి నుంచి ఆశోకునిచే వెలువరించబడిన శాసనాలు ఆనాటి ఉద్యోగులు, న్యాయాధికారుల బాధ్యతలను పౌరులకు తెలియజేయటానికి దేశంలో అనేక చోట్ల చెక్కబడినాయి. వీటిలో ముఖ్యమైనవి కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి శాసనాలు.
అయితే మౌర్యయుగం తరువాత న్యాయవ్యవస్థలో అసమానతలు చోటు చేసుకున్నాయన్న విషయంలో వివాదం లేదు. కులాలవారీగా శిక్షలు అమలు చేయటం జరిగింది. శిక్షలు కఠినంగానే ఉండేవి. ముక్కు చెవులు కోయటం చాలా సామాన్యం, ఆ విధంగా విరూపమైన ముఖాలని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిచేయటం, తెగిన అవయవాలని తిరిగి అతికించటం కోసం ప్రత్యేకమైన వైద్యాలయాలు కూడా ఉండేవని సుశ్రుతుని వైద్య గ్రంథం తెలియజేస్తుంది.