కల్యాణ రామునికోసం సిద్ధమైన కో(గో)టి తలంబ్రాలు
రాజమహేంద్రవరం కల్చరల్ :
కోదండ రాముని కల్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యాన నాలుగు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించిన తలంబ్రాలను గురువారం పుష్కరాల రేవు వద్దకు తీసుకువచ్చారు. శ్రీరామనామ పారాయణతో గోటితో 400 కేజీల ధాన్యం ఒలిచి, కోటి తలంబ్రాలుగా మలిచి, పుష్కరాల రేవు వద్ద పూజలు నిర్వహించారు. శ్రీసూక్తం, శ్రీరామ అష్టోత్తర శతనామ స్తోత్రం, హనుమా¯ŒS చాలీసా చదువుతూ తలంబ్రాలను నింపడానికి తీసుకువచ్చిన కలశాలను గోదావరి జలాలతో శుద్ధి చేశారు. అనంతరం కలశాలకు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా కల్యాణం అప్పారావు మాట్లాడుతూ, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఉన్న రామయ్య కల్యాణ వేదిక వద్దకు ఏప్రిల్ ఒకటో తేదీకి కలశాలను చేరుస్తామని చెప్పారు. భద్రగిరికి ప్రదక్షిణలు చేసి, సీతారామ కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలు అందజేస్తామన్నారు. భారతీయ ఆత్మ శ్రీరాముడని, సీతారామ కల్యాణమంటే ఆత్మకల్యాణమేనని ఆయన తెలిపారు.