పెళ్లి కళ వచ్చేసిందే బాలా..
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌనరాగాలు ఎన్నినాళ్లూ.. అంటూ ఎదురుచూసిన కొత్త జంటలు ఒక్కటయ్యే సమయం వచ్చేసింది. మంగళవారం నుంచి మాఘమాసం మొదలుకావడంతో జిల్లావ్యాప్తంగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నెలరోజులపాటు వేలాది వివాహాలు జరుగనున్నాయి. వీటిలో వందలాది పెళ్లిళ్లకు చినవెంకన్న క్షేత్రం వేదికకానుంది. ఇప్పటికే క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు బుక్ అయిపోయాయి. పెళ్లి బాజాలు, పచ్చిపూల మండపాలు, పురోహితులు, వంట మనుషులు, షామియానాలకు ముందస్తు బుకింగ్లు జరిగిపోయాయి. ఈనెల 11వ తేదీ నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
- ద్వారకాతిరుమల
మాఘమాసంలో నెల పొడవునా ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో బలమైన ముహూర్తాలకు పలువురు ప్రాధాన్యమిస్తున్నారు. ముహూర్తాలకు తగ్గట్లు వివాహాలు కూడా వేల సంఖ్యలో జరగనుండటంతో ఇప్పటికే జిల్లాలోని అన్ని కల్యాణ మండపాలు, సత్రాలు బుక్ అయిపోయాయి. ద్వారకాతిరుమల క్షేత్రంలో నెలరోజులపాటు భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా వరకు గదులు, సత్రాలు, కాటేజీలు, కల్యాణ మండపాలు రిజర్వు అయ్యాయి. కేటరింగ్, పచ్చిపూల మండపాల అలంకరణ, లైటింగ్, బాజాభజంత్రీలు, ట్రావెల్స్, పురోహితులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. పెళ్లి బృందాల వారు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే క్షేత్రంలోని పలు కల్యాణ మండపాలు విద్యుద్దీప అలంకరణలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి.
మండపాలకు యమ డిమాండ్
వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి పచ్చిపూల మండపాలు. వీటి ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటడంతో పాటు మంచి గిరాకీ ఏర్పడింది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వీటి ధర పలుకుతోంది. ఈ క్రమంలో శేషాచలకొండపైన వివాహ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నాయి. మధ్య, పేద వర్గాల వారు ఆలయ ఆవరణలో వివాహాలు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
ఆల్ ఫుల్
ఈనెల 12, 13, 24, 27వ తేదీల్లో జరుగనున్న వివాహాలను పురస్కరించుకుని ఆయా రోజులకు సంబంధించి ఇప్పటికే క్షేత్రంలోని దేవస్థానం, ప్రైవేటు సత్రాలు, గదులు, కాటేజీలు, కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి.
ముహూర్తాలు ఇలా
ఈ ఏడాది మాఘమాసంలో ముహూర్తాల వివరాలను ద్వారకాతిరుమల చెందిన ప్రముఖ
పురోహితుడు గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ వివరించారు. ఈనెల 11వ తేదీ రాత్రి 09.13 గంటలకు, 12న వేకువజాము 04.11కు, రాత్రి 07.34కు, 09.09 గంటలకు ముహూర్తాలు ఉన్నాయి. 13న వేకువజాము 04.07కు, 14న వేకువజాము 04.03, 05.34కు, 17న వేకువజాము 03.51, రాత్రి 08.49కు, 18న వేకువజాము 03.47కు ముహూర్తాలు ఉన్నాయి. 24వ తేదీన రాత్రి 8.21కు, 11.13కు, 25న వేకువజాము 04.50, ఉదయం 07.47కు, 26న ఉదయం 07.43, రాత్రి 08.13కు, 27న వేకువజాము 03.11, రాత్రి 8.09కు, 28న వేకువజాము 03.07కు, ఉదయం 07.35కు ముహూర్తాలు ఉన్నాయి. మార్చి 2న వేకువజాము 04.24, 3న ఉదయం 07.22, 5న రాత్రి 02.43, 6న వేకువజాము 04.14 గంటలకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో ఈనెల 11, 12, 17, 25, 26, 27వ తేదీలు, వచ్చేనెల 3, 6 తేదీల్లో ముహూర్తాలు బలమైనవివని
వెంకటరమణమూర్తి శర్మ తెలిపారు.
నెల పొడవునా ముహూర్తాలు
ఈ మాఘమాసంలో వివాహాలకు అధిక ముహూర్తాలు ఉండటంతో పాటు, అన్ని నక్షత్రాల వారికి తగిన బలమైన ముహూర్తాలొచ్చాయి. ఏటా ఈ మాసంలో నాలుగైదు ముహూర్తాలు మాత్రమే వచ్చేవి. దీంతో పెళ్లి బృందాల వారు త్వరపడాల్సి వచ్చేది. అయితే ఈ సారి ఆ పరిస్థితులు లేవు. నెల పొడవునా బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ద్వారకాతిరుమల క్షేత్రంలోనే వందలాది వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పురోహితులందరూ పెళ్లిళ్లను ఒప్పుకుని బిజీగా ఉన్నారు.
- గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల