సెక్స్‌వర్కర్ల కుమార్తెలు బురదలో పూసిన పూలు
ఇక్కడ బురద అంటున్నది వేశ్యావాటికను కాదు. వేశ్యావాటికను బురద అనే దృష్టికోణమే తప్పు అంటారు ఆ అమ్మాయిలు. సమాజమే ఒక బురద కావచ్చు...అదే ఈ బురదను తయారు చేస్తుండవచ్చు అని కూడా అంటారు. వేశ్య కూతురు వేశ్య అవుతుందని నియమం. కాదు.. సమాజ పరివర్తన కార్యకర్త అవుతుందనినిరూపిస్తున్నారు ఈ ఆశాదీపాలు. ‘స్టాప్ జడ్జింగ్.. స్టార్ట్ ఇంక్లూడింగ్’... ‘తీర్పులు ఆపండి...
మమ్మల్ని తోడు తీసుకోండి’ అని సాదరంగా స్నేహహస్తాన్ని చాపుతున్నారు.
ముంబైలోని కామాటిపురా నుంచి కుర్లాకు నలభై నిమిషాల ప్రయాణం. కాని ఆ ప్రయాణం కొందరికి ఒక జీవితకాలంలో సంభవించకపోవచ్చు. కామాటిపురా నుంచి బయటపడి కుర్లాలోని ‘క్రాంతి’ ఎన్.జి.ఓకు చేరిన వారికి ఒక కొత్తప్రపంచం వీలవుతుంది. ‘క్రాంతి’ సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పని చేస్తోంది. వారి కలలు సాకారం కావడానికి రెక్కలు ఇస్తోంది. ఎగిరి వెళ్లదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తుంది.
అప్పడాలు.. కుట్టుమిషన్లు...
‘2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్.జి.ఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టుపని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్టుండేది. ఆ ఆడపిల్లలు ఏ కలలు కంటే ఆ కలలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను’ అంటుంది రాబిన్చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడి మిలట్రీలో పని చేసి, అక్కడ లెస్బియన్ల పట్ల, గేల పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి సెక్స్‌వర్కర్ల కుమార్తెల కోసం పని చేయడం మొదలెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ఏ సమయంలో అయినా ఏ వేశ్యావాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు. తల దాచుకోవచ్చు.
కామాటిపురా సెక్స్ వర్కర్ల కుమార్తెలు
ద్వేషం నుంచి ప్రేమకు
‘వేశ్యావాటికలో ఉన్నంత కాలం మా అమ్మను నేను ద్వేషించేదాన్ని. మా అమ్మ చేసే పని తప్పు అని నాకు అందరూ చెబుతుండేవారు. కాని క్రాంతి సంస్థలో చేరాక... ఆ పనిని మా అమ్మ కుటుంబం కోసం, నా కోసం చేసి ఉంటుందనే అవగాహన కలిగింది. మనల్ని మనం క్షమించుకోవడం, ఎదుటివారిని క్షమించగలగడం గొప్ప అవకాశం. అందుకే నేను మా అమ్మను ప్రేమించడం మొదలుపెట్టాను’ అంటుంది మెహక్ అనే ఒక వేశ్యకూతురు. క్రాంతికి చేరుకున్న ఇరవై ముప్పై మంది ఆడపిల్లల బాల్యం భయానకంగా ఉంది. ‘మా నాన్న ఎవరో నాకు తెలియదు. కాని వేరొకడు వచ్చి మా అమ్మను ఎప్పుడూ తంతుండేవాడు’ అని ఒకమ్మాయి చెప్తే ‘మా ఇంటికి వచ్చే ఒక మగాడు చిన్నపిల్ల అయిన నా రేటు అడుగుతుండేవాడు. మా అమ్మ వాణ్ణి బయటకు గెంటి నన్ను కాపాడుకుంటూ వచ్చింది’ అని మరో అమ్మాయి చెప్పింది. ‘నేను ఇంటి బయటివెలుతురు కూడా చూడలేదు. రోడ్డు దాటలేదు. బజారు తెలియదు. అయినా మా అమ్మ పడే హింస చూసి పదేళ్ల వయసులో పారిపోయాను. మూడేళ్లు రోడ్ల మీదే తిరిగి ఈ సంస్థకు చేరుకున్నాను’ అని ఒక అమ్మాయి చెప్పింది. సెక్స్‌వర్కర్ల జీవితాల్లో రెండో భర్తగా ప్రవేశించినవాళ్లు వారి కుమార్తెలకు నరకం చూపించడం చాలా మంది ఆడపిల్లల జీవితంలో ఉంది. కాని ఇంత బాధ అనుభవించినా సరే జీవితాన్ని కాంతివంతం చేసుకోవాలని కలలు కనడమే ఈ అమ్మాయిలు చేసిన, చేయగలుగుతున్న గొప్ప పని.
సక్సెస్‌కు అర్థం ఏమిటి?
‘క్రాంతి సంస్థలో చేరిన ఆడపిల్లలకు చదువు ఉండదు. వారి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు ఉండవు. వారు 13 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారు. వారిని ఏ స్కూల్స్‌లోనూ చేర్పించలేము. కనుక మా దగ్గర ఒక స్కూల్ మొదలెట్టాము. ఇది అందరికీ సమానమైన స్కూలు కాదు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్ చేస్తాము’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఒక అమ్మాయిని ఏడో క్లాసు మూడుసార్లు కూచోబెట్టాము. మూడుసార్లు ఫెయిల్ అయ్యింది. నా మిత్రుడు చెప్పాడు– ఆ అమ్మాయికి రాని పని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యాననే భావన కలిగిస్తావు. వచ్చిన పని నేర్పించి పాసయ్యానని అనుకోనివ్వొచ్చు కదా’ అని. ఈ ఫెయిల్ అయిన అమ్మాయి డ్రమ్స్ నేర్చుకుంది. ఇవాళ సంగీతం టీచరుగా చాలామంది పిల్లలకు సంతోషం పంచుతోంది. సక్సెస్‌కు నిజమైన అర్థం ఏమిటో నాకు తెలిసింది’ అంటుంది రాబిన్. క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డాన్సర్ అయ్యింది. ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటోంది. ఒక అమ్మాయి ఫ్లయిట్ అటెండెంట్ కావాలనుకుంటోంది. ఒక అమ్మాయి కామాటిపురాలో స్కూల్ తెరవాని అనుకుంటోంది. అందరు అమ్మాయిలు చక్కటి ఇంగ్లిష్‌లో మాట్లాడటం నేర్చుకున్నారు. అన్నింటికి మించి పెదాల మీద నిర్భయమైన నవ్వును నిలుపుకోవడం నేర్చుకున్నారు.
రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్
క్రాంతిలో చేరిన ఆడపిల్లలు అందరూ అంతో ఇంతో థియేటర్‌ను కూడా నేర్చుకున్నారు. వీరంతా కలిసి ‘లాల్ బత్తి ఎక్స్‌ప్రెస్’ అనే నాటకం తయారు చేశారు. లాల్ బత్తి అంటే రెడ్‌లైట్ అని అర్థం. నాటకంలో ఈ ఆడపిల్లలందరూ తలా ఒక కంపార్ట్మెంట్గా మారిపోతారు. రెడ్‌లైట్ ఎక్స్‌ప్రెస్ ఒక్కో స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ (అమ్మాయి) తన కథ చెబుతూ ఉంటుంది. ఆ కథలన్నీ వేశ్యల జీవితాలను, వారి పిల్లలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, ముంబైలలోనే కాదు న్యూయార్క్, లండన్లలో కూడా ఈ అమ్మాయిలు వెళ్లి ఆ నాటకాన్ని ప్రదర్శించారు. లండన్‌లో నాటక సందర్భంలో అక్కడి వేశ్యలను కలిసి వారి జీవితాలను పరిశీలించారు. ‘పెద్ద తేడా లేదు. అందరం ఒక్కటే’ అని ఒక అమ్మాయి చెప్పింది. ఈ నాటకం జరుగుతున్నంత సేపు వెక్కివెక్కి ఏడ్చే ప్రేక్షకులకు కొదవ ఉండదు.
తీర్పులు ఎందుకు?
‘ఇండియాలో సెక్స్‌వర్క్ లీగల్. కాని సమాజపరంగా తప్పు. ఈ విభజన వారిని తమలో తాము కుంచించుకుపోయేలా చేస్తోంది. వారి చదువుకు, వైద్యానికి, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం చేస్తోంది’ అంటుంది రాబిన్ చౌరాసియా. ‘ఇది తప్పు... ఇది ఒప్పు అని తీర్పులు ఇవ్వడం చాలా సులభం. ఒకరిది తప్పు అని అనడానికి మనం ఎవరం? వారు ఆ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారో అందులో ఎందుకు కొనసాగుతున్నారో మనం ఊహించగలమా? కనుక తీర్పులు చెప్పడం మానండి. వారిని ఎలా కలుపుకుని పోవాలో ఆలోచించండి’ అంటుందామె.ఇది సుదీర్ఘ ప్రయాస అవసరపడే సంగతే. మనుషులు చాలా నెమ్మదిగా మారుతారు. కాని మారరేమో అనుకుని ఊరికే ఉండటం కన్నా మార్చాలని ప్రయత్నించడమే అవసరం. క్రాంతి సంస్థలోని అమ్మాయిలు చేస్తున్నది అదే.– సాక్షి ఫ్యామిలీ