పుణె ఒప్పందంతో అణగారిన వర్గాలకు తీరని నష్టం
సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య
తార్నాక: దేశంలోని అణగారిన వర్గాలను స్వీయ రాజ కీయ శక్తిగా మార్చేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బ్రిటీష్ వారితో పోరాడి సాధించిన కమ్యునల్ అవార్డును హైందవ సమాజం పుణె ఒడంబడిక ద్వారా అడ్డుకుందని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య ఆరోపించారు.
బుధవారం ఓయూ ప్రధాన లైబ్రరీ లోని ఐసీఎస్ఎస్ఆర్ హాల్లో ‘ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్’ (అంసా) ఆధ్వర్యంలో ‘పుణె ఒప్పందం అణగారిన వర్గాలకు స్వీయ రాజ్యాధికారానికి విద్రోహమే’ అనే అంశంపై జరిగిన సదస్సులో మల్లేపల్లి లక్ష్మయ్యతోపాటు ఓయూ ప్రొఫెసర్లు మల్లేశం, లింబాద్రి, అంసా అధ్యక్షులు మందాల భాస్కర్ తది తరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ 1932లో పుణె ఒడంబడిక ద్వారా దళితు లు రాజ్యాధికారం కల్పించాలని అంబేద్కర్ పాటుపడితే దీన్ని గ్రహించిన గాంధీ ఆ ఒడంబడికను అడ్డుకుని దళిత బహుజనులకు తీరని అన్యాయం చేశారన్నారు.
అందుకే అది దళిత బహుజనులు విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. దళిత వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు శక్తిహీనులుగా మారడానికి పుణె ఒప్పందమే కారణమన్నారు. ‘అంసా’ ఓయూ ఉపాధ్యక్షులు చేవూరు ప్రేమ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో నాగం కుమారస్వామి, ప్రదీప్, లింగస్వామి, దుర్గం భాస్కర్, వివిధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.