5న జీశాట్-16 ప్రయోగం
సూళ్లూరుపేట: దేశంలో ట్రాన్స్‌పాండర్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇస్రో.. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహాన్ని ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2.08 గంటలకు ప్రయోగించనుంది. ఫ్రాన్స్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఏరియన్-5 ఈసీఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు. బెంగళూరులో తయారుచేసిన జీశాట్-16 ఉపగ్రహాన్ని ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్‌కు చేర్చారు. ఈ ఉపగ్రహంలో సమాచార వ్యవస్థకు ఉపయోగించే 12 కేయూ బాండ్స్ ట్రాన్స్‌పాండర్స్, 24 సీబాండ్, 12 ఎక్సెటెండెడ్ సీబాండ్ ట్రాన్స్పాండర్లును అమర్చి పంపుతున్నారు.
48 ట్రాన్స్పాండర్లను ఒకేసారి పంపడం ఇదే తొలిసారి. మూడు టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానం మనవద్ద లేకపోవడంతో ఫ్రాన్స్‌తో ఉన్న ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని అక్కడి నుంచి చేపడుతున్నారు. మనం అత్యంత బరువైన ఉపగ్రహాలను ఫ్రెంచి గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి, వాళ్లు అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను మనదేశంలోని శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తున్నారు. స్పాట్-6, స్పాట్-7 వంటి ఫ్రాన్స్ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తెలిసిందే. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాత్మక ప్రయోగం విజయం సాధిస్తే ఇంతటి బరువైన ఉపగ్రహాలను మనమే అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంటుంది.