భార్యతో గొడవ వల్లే ఆత్మహత్య
టాటా మోటార్స్ ఎండీగా పనిచేసిన కార్ల్ స్లిమ్ మొన్నామధ్య ఆత్మహత్య చేసుకున్నారు గుర్తుందా? అందుకు కారణాలేంటో తెలియక అప్పట్లో అంతా ఊరుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసింది. భార్యతో గొడవపడిన తర్వాత.. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. 'కుటుంబంలో కలతలు' అంటూ ఆమె రాసిన మూడు పేజీల లేఖను థాయ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ హోటల్లో వీరిద్దరు విడిది చేసిన గదిలో ఉన్న ఈ లేఖ పోలీసులకు చిక్కింది.
తామిద్దరం గొడవ పడినట్లు ఆ లేఖలో శాలీ స్లిమ్ రాశారని పోలీసు అధికారి సామ్యట్ బుయక్యూ తెలిపారు. దాంతో పాటు ఆయనది హత్య కాదని కూడా తేలిపోయిందని చెప్పారు. తాము బసచేసిన షాంగ్రి-లా హోటల్లోని 22వ అంతస్థు కిటికీ నుంచి కిందకి దూకి స్లిమ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కిటికీ చిన్నది కావడంతో, అందులోంచి ఎవరైనా పొరపాటున జారి కిందపడటం అసాధ్యమని, కావాలనే దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. అంత ఎత్తునుంచి కిందకి దూకడం వల్ల ఆయన కపాలం పగిలిపోయింది. నాలుగో అంతస్థు బాల్కనీలో ఆయన మృతదేహం పడి ఉండగా హోటల్ సిబ్బంది కనుగొన్నారు.
టాటా మోటార్స్ సంస్థకు చెందిన థాయ్ సబ్సిడరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు స్లిమ్ బ్యాంకాక్ వెళ్లారు. ఆయన భార్య రాసిన లేఖను పోలీసులు దర్యాప్తు కోసం థాయ్ భాషలోకి అనువదిస్తున్నారు. ఒకానొక సమయంలో టాటా మోటార్స్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోతున్న సమయంలో బాధ్యతలు చేపట్టి, మళ్లీ భారతీయ మార్కెట్లో నిలదొక్కుకునేలా చేసిన ఘనత స్లిమ్దే. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం సంక్షోభంలో ఉన్న సమయంలో కార్ల్ స్లిమ్ తమ సంస్థలో చేరి సమర్థ నాయకత్వం అందించారని, ఆయన మృతి తీరని లోటని టాటా మోటార్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ వ్యాఖ్యానించారు.