డ్రగ్స్ సరఫరాదారులపై చర్యలు తీసుకోవాలి
- సుప్రీంకోర్టులో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి పిటిషన్
- 18న విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: దేశవాప్తంగా డ్రగ్స్ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేసేలా కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ.10 కోట్ల కన్నా ఎక్కువ విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నప్పుడు, ఆ కేసుల్లో విదేశీ యులు, పలుకుబడి కలిగిన ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై ఈ నెల 18న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేలా ప్రభుత్వాలను ఆదేశిం చాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో గిరిజనులు బతుకు తెరువు కోసం గంజాయి పండిస్తున్నారని, వీరికి ప్రత్యామ్నాయాలు కల్పిస్తే గంజాయి సాగుకు అడ్డుకట్టపడుతుందని పిటిషనర్ వివరించారు. సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్లో డ్రగ్స్ వాడకం, సరఫరాను ఎక్కువ చేసి చూపకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.