వినాయక్ శర్మ సంచలనం
చెన్నై: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ కాజా వినాయక్ శర్మ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. దక్షిణాసియాలోని ఏకైక ఏటీపీ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో ఈ వైజాగ్ కుర్రాడు క్వాలిఫయింగ్ పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో ప్రపంచ 902వ ర్యాంకర్ వినాయక్ శర్మ 6-4, 6-7 (5/7), 7-6 (7/4)తో ప్రపంచ 119వ ర్యాంకర్, రెండో సీడ్ అలెగ్జాండర్ కుద్రయెత్సెవ్ (రష్యా)పై సంచలన విజయం సాధించాడు. 2 గంటల 58 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో 23 ఏళ్ల వినాయక్ శర్మ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు.
సోమవారం జరిగే క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)తో వినాయక్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వినాయక్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. మరోవైపు భారత్‌కే చెందిన యువ ఆటగాళ్లు విష్ణువర్ధన్, యూకీ బాంబ్రీలకు నిరాశ ఎదురైంది. హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ 5-7, 4-6తో ఇల్యా మర్చెంకో (ఉక్రెయిన్) చేతిలో; యూకీ బాంబ్రీ 6-1, 6-7 (3/7), 3-6తో విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) చేతిలో ఓడిపోయారు.