ఫిబ్రవరి 23న టీబీజీకేఎస్ ఎన్నికలు
గోదావరిఖని/మంచిర్యాలసిటీ/కొత్తగూడెం, న్యూస్‌లైన్ : సింగరేణి గుర్తింపు సంఘం(టీబీజీకేఎస్)లో ఏర్పడిన అంతర్గత నాయకత్వ పోరు కు ఎట్టకేలకు తెరపడనుంది. నాయకుల వర్గపోరు కారణంగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు తగిన న్యాయం చేసేందుకు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ శ్రీవాస్తవ ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేర కు మంగళవారం హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ ప్రకటించారు. ఫిబ్రవరి 23వ తేదీన గోదావరిఖని ఏరియాలో జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహించి అందులోనే సీక్రెట్ బ్యాలెట్ ద్వారా యూనియన్ అంతర్గత ఎన్నికలు జరుపుకోవాలని కమిషనర్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. యూనియన్ బైలాస్ ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవులకు ఈనెల 31వ తేదీన నామినేషన్లను స్వీకరించి, ఫిబ్రవరి 4వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకా శం కల్పించారు.
ప్రచారం కోసం ఆ తర్వాత రోజు 15 రోజుల సమయం ఇచ్చారు. అయితే 15 రోజుల ప్రచారం తర్వాత ఫిబ్రవరి 19నాడే ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు పనిదినం కావడంతో కార్మికులు ఎక్కువ గా హాజరుకాలేకపోతున్నారు. దీంతో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం సింగరేణికి సెలవుదినం కావడంతో అదేరోజు ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు ఎక్కువ మంది అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో ఆర్ఎల్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు యూనియన్‌లోని ఇరువర్గాల నాయకులు సమ్మతించినట్లు సమాచారం.
కాగా, టీబీజీకేఎస్‌కు సభ్యత్వం చెల్లిస్తున్న మొత్తం 40,576 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, కమిషనర్‌తో జరిగిన చర్చల్లో ఆర్జీ-3 డివిజన్ నుంచి పెర్కారి నాగేశ్వర్రావు, నాగెల్లి సాంబ య్య, పర్రె రాజనరేందర్, వేగోలపు మల్లయ్య, దేవ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, గిటుకు శ్రీనివాస్, గాజుల తిరుపతి పాల్గొన్నారు.
ఇక్కడే ప్రారంభమైన వర్గపోరు..
సింగరేణిలో 2012 జూన్ 28వ తేదీన జరిగిన ఐదో దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అయితే గుర్తింపు సంఘంగా గెలుపొందిన కొంతకాలానికే యూనియన్‌లో నాయకత్వ పోరు ప్రారంభమైంది. ఈ తరుణంలో యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణం తో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మిర్యాల రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2013 మే 19వ తేదీన గోదావరిఖని లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి, విషయాన్ని కెంగెర్ల వర్గీయులు టీఆర్ఎస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే అదే నెల 26వ తేదీన శ్రీరాంపూర్‌లో మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మల్లయ్యను తొలగించి కొత్తగూడెంకు చెందిన కనకరాజును ఎన్నుకున్నట్లు ప్రకటిం చారు. అప్పటి నుంచి గుర్తింపు యూనియన్‌లో రెండు కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. దీంతో సమస్యలపై చర్చించేందుకు ఎవరిని పిలవాలనే మీమాంసలో సింగరేణి యాజమాన్యం పడిపోయింది. అయితే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అనంతరం వరంగ ల్ లోని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (వరంగల్) వద్దకు చేరింది.
ఈ క్రమంలో ఆగస్టు 27వ తేదీ న యూనియన్ బైలాస్ ప్రకారం నవంబర్ 30 వ తేదీన ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ తమకు ఎన్నిక లు నిర్వహించిన అనుభవం లేదని జేసీఎల్ పేర్కొనడంతో డిసెంబర్ 31వ తేదీలోగా తిరిగి ఎన్ని కలు జరపాలని, ఆ బాధ్యతలు సెంట్రల్ రీజినల్ లేబర్ కమిషనర్ చూడాలని డిసెంబర్ 3న హైకోర్టు నుంచి తీర్పు వెలువడింది. అయి తే కోర్టు నుంచి తీర్పు ఉత్వర్తు కాపీ డిసెంబర్ 20వ తేదీన ఆర్ఎల్సీకి చేరగా నెలారునాటికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉంద ని, అది సరిపోదని తిరిగి ఆర్ఎల్సీ కోర్టును ఆశ్రయించారు.
కాగా, ప్రస్తుతం జనవరి 31వ తేదీలోగా యూనియన్‌లో ఏర్పడిన నాయకత్వ పోరుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఇందులో భాగంగా ఈనెల 21, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యం లో ఫిబ్రవరి 23వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌లో అంతర్గత నాయకత్వ ఎన్నికలు జరిపిందుకు నిర్ణయాలు తీసుకు న్నారు. ఈ పరిణామం సింగరేణి చరిత్రలోనే మొదటిది కాగా వివిధ కార్మిక సంఘాలు ఆసక్తి గా గమనిస్తున్నాయి.
ఇక రేపటి నుంచి మిర్యాల, కెంగెర్ల వర్గీయులు ఎన్నికల్లో గెలుపు కోసం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. అయితే మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మం చిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకోవడానికి మరింత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది.
గెలుపుకోసం కెంగెర్ల, మిర్యాల వర్గీయుల ఆరాటం..
టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రస్తుత అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు ఆరాటపడుతున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఫోన్లు చేస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, మిర్యాల రాజిరెడ్డికి మద్దతుగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో ఆయన బలనిరూపణ చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో గత ఏడాది కాలంగా రాజుకున్న వర్గపోరు ఈ ఎన్నికలతో కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని కార్మికులు సంతోషపడుతున్నారు.