Keshava Reddy educational institutions
-
కేశవరెడ్డిని నమ్మి మోసపోయాం
కర్నూలు: ‘‘కేశవరెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయాం... న్యాయం చేయండి’’ అంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులు శుక్రవారం కర్నూలు బీ క్యాంపులోని సీఐడీ కార్యాలయంలో ఏఎస్పీ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది బాధితులు కర్నూలుకొచ్చి ఏఎస్పీ శ్రీధర్‌ను కలిశారు. మూడు సంవత్సరాల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థలను ఆయన కుమారుడైన భరత్‌కుమార్‌రెడ్డి చూస్తున్నారని..సీఐడీ ఆధీనంలో ఉన్న పాఠశాలలను అతను ఎలా అజమాయిషీ చేస్తారని ప్రశ్నించారు. అప్పునకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు జిరాక్స్ కాపీలు తీసుకొని డబ్బును దామాషా ప్రకారం బాధితులకు పంపిణీ చేస్తామని మూడేళ్ల క్రితం సీఐడీ అధికారులు హామీ ఇవ్వడం వల్లే ఇంత కాలం వేచి చూశామన్నారు. ప్రామిసరీ నోట్లకు చట్టపరమైన కాలపరిమితి అయిపోయినప్పటికీ సీఐడీ అధికారుల హామీతో న్యాయస్థానాల్లో దాఖలు చేసుకోలేదని వివరించారు. చాలా మంది రిటైర్డ్ అధికారులు, వ్యాపారులు.. కేశవరెడ్డి విద్యాసంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టి మోసపోయారన్నారు. పిల్లల చదువులు, పెళ్లిలకు సంబంధించిన దాచుకున్న డబ్బులను కూడా కేశవరెడ్డికి అప్పిచ్చి మోసపోయినట్లు పేర్కొన్నారు. సీఐడీ అధికారుల చర్యలపై నమ్మకంతోనే ఇంత కాలం వేచి ఉన్నామని, మూడేళ్లు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు గుండాలు.. కేశవరెడ్డి విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో సీఐడీ అధికా>రులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, నారాయణల రాజకీయ అండతో కేశవరెడ్డి తమ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు హరినాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఆత్మకూరు ప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్, సోమశేఖర్‌రావు, దశరథరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఎల్వీఆర్ఎస్ కృష్ణమూర్తి , సూర్యనారాయణరెడ్డి, జూపల్లి సంజీవరెడ్డి, సీహెచ్ శివరామిరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి, పి.రామిరెడ్డి తదితరులు ఏఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. -
విద్యా వ్యాపారం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన పాఠశాలల్లో అనధికారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పలాయనం చిత్తగించడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో మరిన్ని ఉన్నాయనేది అక్షరసత్యమైనా.. విద్యాశాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి. ప్లేస్కూళ్లకు వేలల్లో వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లూ ఫీజుల దందాకు దిగినా ఆడిగేవారే కరువయ్యారు. కేశవరెడ్డి పాఠశాలల్లో రెండు నుంచి మూడు లక్షల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ చేయించుకుంటారు. వాటికి ప్రామిసరి నోట్ రాసిచ్చి విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. వెళ్లిపోయేటప్పుడు వారు కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దీంతో కేశవరెడ్డి పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ చేశారు. ఈ తరహాలో ఫీజులు అనధికారంగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో వసూళ్లు డిపాజిట్ల సంస్కృతి ఒక్క కేశవరెడ్డి పాఠశాలల్లోనే కాదు.. మరికొన్ని పాఠశాలల్లోనూ కనిపిస్తోంది. పలు కార్పొరేట్ పాఠశాలల్లోనూ డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఓ విద్యానికేతన్ పాఠశాలలో లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు, నందికొట్కూరు రోడ్డులోని పాఠశాలల్లో అనధికారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఎమ్మిగనూరులోని ఓ కార్పొరేట్ పాఠశాలల, ఆదోనిలో మిల్టన్ గ్రూప్ స్కూల్స్, రాంజల రోడ్డులోని ఓ పాఠశాలల్లో అనధికారిక వసూళ్ల దందా కొనసాగుతోంది. చట్టవిరుద్ధం చదువుకోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు అనధికారంగా వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ విషయం పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖాధికారులకు తెలియనిది కాదు. అయినా పట్టించుకోకపోవ డం దారుణం. మరోవైపు విద్యా సంస్థలు నడిపే యాజ మాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేసి వ్యాపారాలకు తెరతీస్తుండటం సుస్పష్టం. నమ్మకంపైనే డిపాజిట్ చేస్తారు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఉన్న నమ్మకంతోనే డిపాజిట్లు కట్టారు. అయితే వాళ్లు నమ్మకాన్ని వమ్ముచేశారు. ఇది 100 శాతం చట్టవిరుద్ధం. తల్లిదండ్రులు సహనం పాటించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా వచ్చే విద్యను సంరక్షించుకోవాలి. - చెన్నయ్య, టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, కర్నూలు తల్లిదండ్రులు కట్టించిన ఫీజులను వెనక్కివ్వాలి కేశవరెడ్డి పాఠశాలల్లో జరిగిన ఫీజు దోపిడీకి విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కట్టిన డిపాజిట్లను ప్రభుత్వమే చెల్లించి న్యాయం చేయాలి. విద్యాశాఖ కళ్లు మూసుకుని పనిచేస్తోంది. ఇలాంటి దందాలు జిల్లాలో మరిన్ని స్కూళ్లలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. -లక్ష్మీనరసింహ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం జిల్లాలో ఎక్కడైనా కేశవరెడ్డి స్కూళ్ల తరహాలో డిపాజిట్లు కట్టించుకొని తిరిగివ్వకపోతే ఫిర్యాదు చేయండి. చట్టవిరుద్ధంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. ఆదోని మిల్టన్ గ్రూప్ ఆఫ్ స్కూళ్లపై విచారణ చేస్తా. కేశవరెడ్డిని అరెస్టు చేసినా స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. - డీవీ సుప్రకాష్, డీఈఓ