కేశవరెడ్డిని నమ్మి మోసపోయాం | Keshava Reddy Victims Meet Kurnool ASP | Sakshi
Sakshi News home page

కేశవరెడ్డిని నమ్మి మోసపోయాం

Published Sat, May 12 2018 12:39 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

Keshava Reddy Victims Meet Kurnool ASP - Sakshi

సీఐడీ ఏఎస్పీ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కేశవరెడ్డి బాధితులు

కర్నూలు: ‘‘కేశవరెడ్డి చెప్పిన మాయమాటలు నమ్మి డబ్బులు అప్పుగా ఇచ్చి మోసపోయాం... న్యాయం చేయండి’’ అంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల బాధితులు శుక్రవారం కర్నూలు బీ క్యాంపులోని సీఐడీ కార్యాలయంలో ఏఎస్పీ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 20 మంది బాధితులు  కర్నూలుకొచ్చి ఏఎస్పీ శ్రీధర్‌ను కలిశారు. మూడు సంవత్సరాల నుంచి కేశవరెడ్డి విద్యాసంస్థలను ఆయన కుమారుడైన భరత్‌కుమార్‌రెడ్డి చూస్తున్నారని..సీఐడీ ఆధీనంలో ఉన్న పాఠశాలలను అతను ఎలా అజమాయిషీ చేస్తారని ప్రశ్నించారు. అప్పునకు సంబంధించిన ప్రామిసరీ నోట్లు జిరాక్స్‌ కాపీలు తీసుకొని డబ్బును దామాషా ప్రకారం బాధితులకు పంపిణీ చేస్తామని మూడేళ్ల క్రితం సీఐడీ అధికారులు హామీ ఇవ్వడం వల్లే ఇంత కాలం వేచి చూశామన్నారు.

ప్రామిసరీ నోట్లకు చట్టపరమైన కాలపరిమితి అయిపోయినప్పటికీ సీఐడీ అధికారుల హామీతో న్యాయస్థానాల్లో దాఖలు చేసుకోలేదని వివరించారు. చాలా మంది రిటైర్డ్‌ అధికారులు, వ్యాపారులు.. కేశవరెడ్డి విద్యాసంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టి మోసపోయారన్నారు. పిల్లల చదువులు, పెళ్లిలకు సంబంధించిన దాచుకున్న డబ్బులను కూడా కేశవరెడ్డికి అప్పిచ్చి మోసపోయినట్లు పేర్కొన్నారు. సీఐడీ అధికారుల చర్యలపై నమ్మకంతోనే ఇంత కాలం వేచి ఉన్నామని, మూడేళ్లు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు గుండాలు.. కేశవరెడ్డి విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారని, ఈ విషయంలో సీఐడీ అధికా>రులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, నారాయణల రాజకీయ అండతో కేశవరెడ్డి తమ ఆస్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు హరినాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఆత్మకూరు ప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్, సోమశేఖర్‌రావు, దశరథరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఎల్‌వీఆర్‌ఎస్‌ కృష్ణమూర్తి , సూర్యనారాయణరెడ్డి, జూపల్లి సంజీవరెడ్డి, సీహెచ్‌ శివరామిరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి, పి.రామిరెడ్డి తదితరులు ఏఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement