కావ్య ప్రపంచ సృష్టికర్త ‘కవి’
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘అపారమైన కావ్యప్రపంచానికి సృష్టి కర్త కవి. ఒక కవిని సత్కరించుకోవడమంటే భగవంతుని సత్కరించుకోవడమే’ అని బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం తెలుగుభాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమఘాట్లోని శ్రీవిశ్వవిజ్ఞానవిద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ తెలుగు గేయకవి మహమ్మద్ ఖాదర్ఖాన్ను స్కరించారు. ఈ సందర్భంగా సభాసంచాలకత్వం వహించిన ఎండ్లూరి సుధాకర్ మాట్లాడుతూ రాజులు ప్రపంచాన్ని శాసించగలరేమో గానీ అక్షరసృష్టితో కావ్యజగత్తుని శాసించగల సత్తా ఒక కవికి మాత్రమే ఉందన్నారు. రాజకీయాలు పెరిగాక కవులకు, కళాకారులకు, ఆధ్యాత్మిక వేత్తలకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని, ప్రేమతత్వాన్ని రంగరించి కవితలు అల్లుతున్న ఖాదర్ఖాన్ను సత్కరించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. అధ్యక్షత వహించిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మాట్లాడుతూ పీఠంలో కుల, మత వివక్ష లేదన్నారు. స్వాగతవచనాలు పలికిన రాష్ట్రపతి సమ్మానిత చింతలపాటి శర్మ మాట్లాడుతూ భాష ప్రవాహం వంటిదని, పాత పదాలు పోయి, కొత్తపదాలు వస్తూనే ఉంటాయని అన్నారు. తెలుగు భాషలో అరబ్బీ, ఉర్దూ, పారశీపదాలు కలిసిపోయినట్టే, తెలుగు పదాలు అరబ్బీలో కలిసిపోయాయన్నారు. ఇతర భాషాపదాల వినిమయం ఏ భాషకైనా తప్పదన్నారు. వ్యావహారిక భాషోద్యమకారుడు గిడుగు రామమూర్తికి నివాళులర్పించారు. విశ్రాంత ప్రిన్సిపాల్ పసల భీమన్న, ప్రజాపత్రిక గౌరవసంపాదకుడు సుదర్శన శాసి్త్ర,నాట్యాచార్యుడు సప్పా దుర్గా ప్రసాద్ ప్రసంగించారు. ఉమర్ ఆలీషాచేతుల మీదుగా ఖాదర్ఖాన్ను సత్కరించారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు.