రైతులకు రెట్టింపు లాభం
2022 కల్లా అమలు చేస్తామన్న ప్రధాని
* పంట బీమా విధివిధానాల ఆవిష్కరణ
* ఏప్రిల్ 14న ఈ-అగ్రి ప్రారంభం
సెహోర్ (మధ్యప్రదేశ్): భారతదేశంలో అన్నదాతలకు 2022 కల్లా రెట్టింపు లాభాలు తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో ‘కిసాన్ కల్యాణ్ మేళా’లో పాల్గొన్న ప్రధాని.. ఇటీవలే ప్రకటించిన జాతీయ పంట బీమా పథకానికి సంబంధించిన విధివిధానాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పంట బీమాకు సంబంధించిన పలు వివరాలను ప్రధాని రైతులకు వివరించారు. పంట నష్టం విషయం తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం చెల్లిస్తారని.. మిగిలిన మొత్తాన్ని వీలైనంత త్వరలో చెల్లిస్తారని ప్రధాని తెలిపారు. పంట వేసిన 14 రోజుల్లోపల నష్టం జరిగినా దాన్ని బీమాకు వర్తింపచేస్తామన్నారు. గతంలో 20 శాతం మంది రైతులకు మాత్రమే ప్రభుత్వ పాలసీలు అందేవని.. వీటిని తక్షణమే కనీసం 50 శాతం మందికి అందించాలనేది తమ ప్రభుత్వ ఆశయం అని మోదీ చెప్పారు.
‘పంట బీమా పథకాన్ని వాజ్‌పేయి ప్రారంభించారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక.. రైతులకు ఈ పథకంపై నమ్మకం పోయింది. ఓవైపు విపత్తులతో నష్టపోతున్నా.. పంట బీమాపై వ్యతిరేక భావనతోనే ఉన్నారు’ అని మోదీ అన్నారు. ఒకసారైనా బీమా తీసుకుని ప్రయత్నించండని అన్నదాతలను కోరారు. 2022 కల్లా రైతులకు రెట్టింపు లాభం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట ఉత్పత్తిని పెంచటం ద్వారా దేశీయ అవసరాలను తీర్చటంతోపాటు.. విదేశాలకు ఎగుమతి చేసుకోవటంపైనా దృష్టిపెట్టాలన్నారు.
వాతావరణ మార్పులతో నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం వివిధ పథకాలను అందుబాటులోకి తెస్తోందని ప్రధాని తెలిపారు. భూసార కార్డుల పథకం, ప్రధానమంత్రి నీటిపారుదల పథకం, సేంద్రియ వ్యవసాయంతోపాటు.. చెరకు రైతులకోసం వీలైనంత ఎక్కువ యూరియా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాలను అందుబాటులోకి తేవటంపై ప్రధాని వివరించారు. దీంతో పాటు ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ-అగ్రి వేదికను ప్రారంభించనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
దీని ద్వారా.. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడ మంచి రేటు వస్తే అక్కడ అమ్ముకోవచ్చన్నారు. అంతా మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతుందని ప్రధాని తెలిపారు. జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ప్రారంభించి.. దేశవ్యాప్తంగా ఉన్న 585 మార్కెట్లను 2018 వరకు విడతల వారిగా ఒకేవేదికపైకి తీసుకువస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర ఇలాంటి హోల్‌సేల్ మార్కెట్ల ఏర్పాటుకోసం ఇప్పటికే ప్రతిపాదలను పంపాయని తెలిపారు. ‘నేను రైతు వ్యతిరేకినని విమర్శిస్తున్నారు. నాకేం ఇబ్బంది లేదు. రైతుల కోసం తీసుకొస్తున్న ఈ పథకాన్ని ఎవరూ విమర్శించే ధైర్యం చేయరు’ అని అన్నారు.