రెండురోజులపాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు
హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీలలో సికింద్రాబాద్‌లోని కేజేఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 7 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతత్వం, భావజాలంపై, అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో పాలక పక్షాలైన బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలపై స్థానిక ప్రజాప్రతినిధులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ శాస్త్రవేత్తలతో శిక్షణ ఇవ్వనున్నారు. గతంలో పురపాలక సంఘాల స్థాయిలో పట్టణ స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణా తరగతులు నిర్వహించిన తరహాలోనే ఈసారి గ్రామీణ స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా మొదటిరోజున జడ్పీటీసీలు, ఎమ్పీపీలు, ఎమ్పీటీసీలు, సింగిల్ విండో ఛైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. రెండో రోజున సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు శిక్షణా తరగతుల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు, రామచంద్ర కుంతియా తదితరులు పాల్గొంటారు.