డివైడర్‌ను ఢీకొన్న కారు
- ఒకరి మృతి - ఆరుగురికి గాయాలు
- వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తుండగా ఘటన
- అందరూ కర్ణాటకలోని రాయచూరు వాసులే
చిలమత్తూరు (హిందూపురం) : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మీదుగా వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిలోని కోడూరు తోపు సమీపంలో గల పెద్దన్నపల్లి-కనిశెట్టిపల్లె మధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని ఇన్చార్జ్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన టి.అంబరీశ్(47)కు హృదయ సంబంధిత వైద్యం కోసం కారులో బెంగళూరుకు బయలుదేరారు.
మార్గమధ్యంలోని పెద్దన్నపల్లి క్రాస్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పూర్తిగా దెబ్బతింది. ఘటనలో అంబరీశ్ అక్కడికక్కడే మరణించగా, టి.శివకుమార్, ఎం,రవికుమార్, చింతా సురేశ్(డ్రైవర్), సావిత్రి, చిన్నారులు ప్రవళ్లిక, వినయ్‌కుమార్ గాయపడ్డారు. వారిని బాగేపల్లి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా అన్న మృతదేహంపై పడి చెల్లెలు గాయత్రి కన్నీరుమున్నీరయ్యారు. అన్నా.. లెయ్ అన్నా.. అంటూ బుగ్గలు నిమురుతూ గుండెలవిసేలా రోదించడం చూసిన వారి హృదయాలు బరువెక్కాయి.