టెవా-మైలాన్ డీల్ నాట్కోకి దెబ్బా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ‘కొపాక్జోన్’ పేటెంట్ వివాదం మరింత ముదరనుందా? ప్రస్తుతం అంతర్జాతీయ ఫార్మా మార్కెట్లో సంచలనం రేపుతున్న టెవా- మైలాన్ డీల్ వార్తలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నాట్కో ఫార్మాకి కొంత ఇబ్బంది కలిగిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాన్ కంపెనీని టెవా ఫార్మా కొనుగోలు చేస్తే అది కొపాక్జోన్ పేటెంట్‌పై తప్పకుండా ప్రభావం చూపుతుందని, ఈ భయాలతోనే బుధవారం నాట్కో ఫార్మా షేరు ఒకానొక దశలో ఆరు శాతంపైగా నష్టపోయిందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చివరకు నాలుగు శాతం నష్టంతో రూ. 2,064 వద్ద ముగిసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మైలాన్‌ను రూ. 2.50 లక్షల కోట్లకు కొనుగోలు చేయడానికి ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న టెవా ఫార్మా బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం జరిగితే ఫార్మా చరిత్రలో ఇదే అతిపెద్ద టేకోవర్‌గా రికార్డులకు ఎక్కడమే కాకుండా అమ్మకాల పరంగా టెవా ఫార్మా నంబర్‌వన్ స్థానానికి ఎగబాకుతుంది.
ఆందోళనకు ఇదీ కారణం
నాడీ సంబంధిత వ్యాధుల చికిత్సకు వినియోగించే కొపాక్జోన్ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ ఉంది. 2014లో రూ 26,460 కోట్ల విలువైన కొపాక్జోన్ అమ్మకాలు జరిగాయి. టెవా లాభంలో 50 శాతం ఈ ఒక్క ఔషధం నుంచే వస్తోందంటే ఇది ఎంత కీలకమైనదో అర్థం చేసుకోవచ్చు. కొపాక్జోన్పై టెవా ఫార్మా కలిగి ఉన్న పేటెంట్ హక్కులు ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నాయి. దీనికి సంబంధించి జెనరిక్ వెర్షన్‌ను విక్రయించే అనుమతుల్ని దేశ, విదేశాల్లో మైలాన్‌తో కలిసి నాట్కో ఫార్మా దక్కించుకుంది.
దీన్ని సవాల్ చేస్తూ టెవా కోర్టులకు ఎక్కింది. పలు కోర్టుల్లో ఈ తీర్పు నాట్కోకి అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ వివాదం ఇంకా అమెరికా కోర్టు వద్ద పెండింగులో వుంది. అమెరికాలో ఈ ఔషధ విక్రయానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతుల్ని నాట్కో పొందింది. ఇప్పుడు మైలాన్‌ను టెవా ఫార్మా కొనుగోలు చేస్తే నాట్కో ఫార్మాతో ఉన్న కొపాక్జోన్ మార్కెటింగ్ ఒప్పందం ఏమవుతుందనేది కీలకంగా మారింది. ఈ ఒప్పందానికి టెవా ఫార్మా ఒప్పుకోదని, దీంతో నాట్కో ఫార్మా వేరే మార్కెటింగ్ భాగస్వామిని వెతుక్కోవాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ కొపాక్జోన్ జెనరిక్ వెర్షన్ విడుదల మరింత ఆలస్యం చేసే విధంగా ఉన్నాయని, ఇది కచ్చితంగా నాట్కో ఎగుమతుల ఆదాయంపై ప్రభావం చూపుతుందని అంచనా. జరుగుతున్న పరిణామాలపై నాట్కో ఫార్మా ప్రతినిధులు మాట్లాడటానికి నిరాకరించారు. కానీ మైలాన్ టేకోవర్ వార్తలు మాత్రం నాట్కో యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేశాయని, జరుగుతున్న పరిణామాలను ఎదుర్కోవడానికి ఎలా వ్యవహరించాలన్నదానిపై బుధవారం అత్యవసరంగా సమావేశమై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.