koppula eeswar
-
మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం, అభ్యున్నతి కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హజ్‌హౌస్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో జరిగిన డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం దేశంలో రూ. 4వేల కోట్ల బడ్జెట్ కేటాయించగా తెలంగాణ రాష్ట్రంలోనే రూ. 2 వేల కోట్లు కేటాయించి మైనారిటీ సంక్షేమం, అభ్యున్నతికి పెద్దపీట వేసిందన్నారు. నిధులను పూర్తిగా వినియోగించి మైనారిటీల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. మైనారిటీ సంక్షేమానికి షాదీముబారక్, మసీదుల నిర్మాణం, మరమ్మతులు, ఇమాంలకు పారితోషికం, స్వయం ఉపాధి పథకాలు, మైనారిటీ గురుకులాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. డైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమం కింద ప్రభుత్వ సబ్సిడీతో మైనారిటీ యువతకు కార్లను అందజేసి వారి జీవనోపాధికి కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సౌజన్యంతో కార్ల వితర ణ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతిని వినియోగించుకొని వారి జీవితాలను మెరుగుపర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. మైనారిటీ సంక్షేమ పథకాల అమల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ ఆదర్శం... దేశంలోనే మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మైనారిటీ విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మైనారిటీ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను దిశా నిర్ధేశం చేసుకోవాలని సూచించారు. నాంపల్లి శాసన సభ్యుడు జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. డ్రైవర్ ఎంపవర్ మెంట్ కార్యక్రమాన్ని మరింత విస్తరించి పెద్ద సంఖ్యలో మైనారిటీలకు అందేలా చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంక్షేమ శాఖాధికారులను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ అన్సారీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీమ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఏక్కా, ఎంఎఫ్సీ ఎండీ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా 67 మంది మైనారిటీ యువకులకు కార్లను పంపిణీ చేశారు. -
గురుకులాల్లో ‘ సమ్మర్ సమురాయ్’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కోసం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ‘సమ్మర్ సమురాయ్’పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వేసవి సెలవుల్లో సమయం వృ«థా చేయకుండా క్రీడలపై దృష్టిని సారించేందుకు సొసైటీ యంత్రాంగం వీటికి రూపకల్పన చేశాయి. దీంతో తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపయోగకరంగా ఉంటాయనేది అధికారుల భావన. ఈ శిక్షణల్లో పోటీపరీక్షలకు సన్నద్ధం కావడం, క్రీడా నైపుణ్యాలు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2013 నుంచే 3 చోట్ల ‘సమ్మర్ సమురాయ్’ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ దాన్ని విస్తరిస్తూ 2019లో 88 క్యాంపులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల కోసం అమ్మానాన్న హల్చల్.. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని సొసైటీలు నిర్ణయించాయి. ‘అమ్మా–నాన్న హల్చల్ ’పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పిల్లల పెంపకం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. ఏప్రిల్, మే నెలలో దశల వారీగా ఈ క్యాంపులను నిర్వహిస్తారు. శిబిరాలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘సమ్మర్ సమురాయ్’, అమ్మానాన్న హల్చల్ కార్యక్రమాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తయారు చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 3వేల మంది విద్యార్థులతో ఈ శిబిరం ప్రారంభమైందని, ప్రస్తుతం 2లక్షలకు పెరిగిందన్నారు. ఈ క్యాంపుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భోజన సౌకర్యాలతో పాటు వసతి కూడా కల్పిస్తోందని, శిక్షణ పొంది న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అమ్మా–నాన్న హల్ చల్’పేరుతో కార్యక్రమా లు చేపట్టామన్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల మంది విద్యార్థులకు... ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు రెండు లక్షల మందికి వేసవి శిబిరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్సీ గురుకులాలకు చెందిన 1.5లక్షలు, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 50వేల మంది విద్యార్థులున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సంబంధిత సెట్(ప్రవేశ పరీక్ష)లకు శిక్షణ ఇస్తారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి నిర్దేశిత వాటిలో కోచ్‌లతో శిక్షణ ఇస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ యాప్స్, డ్రోన్ తయారీ, మల్టీ మీడియా, లైఫ్ కెరీర్ కోడింగ్, కంప్యూటర్ కోర్సుల్లో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, స్టాక్ మార్కెట్‌పై అవగాహన, శాస్త్రీయ, పాప్ సంగీతం, స్కేటింగ్ తదితరాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
కరీంనగర్ స్పోర్ట్స్ : సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం స్థానిక జ్యోతి బాపూలే మైదానంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బ్యాటింగ్ చేసి కరీంనగర్–సుల్తానాబాద్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు సర్వాయిపాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 32 జట్లు హాజరయ్యాయని, మంగళవారం నుంచి ఈ నెల 17 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణగాని సత్యనారాయణగౌడ్ తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ రవీందర్ సింగ్, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మల్లేశంగౌడ్, పల్లె నారాయణగౌడ్, పర్శురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.