బంధాన్ని కాదని.. డబ్బుకు బందీయై!
♦ కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఇల్లాలు
♦ ఇన్సూరెన్స్ నగదు కోసం మేనల్లుడితో కలసి ఘాతుకం
♦ వీడిన కొత్తగంగుబూడి హత్యకేసు మిస్టరీ
విజయనగరం: బంధం కన్నా.. ఆమెకు డబ్బే ఎక్కువైంది. రూ.లక్షలు వస్తాయన్న ఆశతో కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఎల్.కోట మండలం కొత్త గంగుబూడి సమీపంలో గత నెల 26న జరిగిన హత్యకేసు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భార్య, మేనల్లుడు, ఇతర కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శుక్రవారం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎల్.కాళిదాసు రంగారావు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గండబోయిన శ్రీనివాస్ కాకినాడలో ఉన్న తన మేనమామ వై.నూకరాజు పేరున రూ.38 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. మేనమామను హతమారిస్తే ఆ నగదును కాజేయవచ్చని పథకం పన్నాడు. కొంత సొమ్మును మేనత్తకిచ్చి మిగిలిన సొమ్మును తన సొంతం చేసుకోవచ్చని భావించాడు.
ఇందుకు మేనత్త(నూకరాజు భార్య) వరలక్ష్మి కూడా సహకరించింది. గత నెల 26న మేనమామను తీసుకురమ్మని అత్తకు చెప్పాడు. ఆమె తన భర్తను విశాఖ తీసుకొచ్చింది. అక్కడి నుంచి కారు అద్దెకు తీసుకుని మేనమామ, అతని భార్య వరలక్ష్మి, సమీప బంధువులైన కట్టా రాము, గద్దాడ వెంకటరావు, వంక బంగార్రాజులతో కలిసి విశాఖ నుంచి ఎస్.కోట బయలుదేరారు. ఎల్.కోట మండలం గంగుబూడి సమీపంలో నూకరాజును రాయితో కొట్టి హతమార్చి పరారయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి హత్యగా.. ఎల్.కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే మేనమామను శ్రీనివాస్, మేనమామ భార్య వరలక్ష్మి, కట్టా రాము, వెంకటరావు, బంగార్రాజులు కుట్రపన్ని హతమార్చినట్లు వెల్లడైందని ఎస్పీ రంగారావు తెలిపారు. శ్రీనివాస్‌తోపాటు, వరలక్ష్మి, రాములను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. వెంకటరావు, వంక బంగర్రాజులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎ.వి.రమణ, ఎల్.రాజేశ్వరరావు, ఎస్.కోట సీఐ బి.రమణమూర్తి, ఎల్.కోట ఎస్సై ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.