రైలు ప్రమాదంలో నలుగురి మృతి
సాక్షి, ముంబై: ముంబై నుంచి కొల్హాపూర్‌కు బయలుదేరిన కోయినా ఎక్స్‌ప్రెస్ నలుగురు గ్యాంగ్మెన్లను ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. అందిన వివరాల మేరకు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టాకూర్లి-కళ్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రైల్వేట్రాక్‌ను గ్యాంగ్మెన్లు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కోయినా ఎక్స్‌ప్రెస్‌ను వీరు గమనించలేకపోయారు. రైలు ఒక్కసారిగా వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటనాస్థలంలోనే కార్మికుల మృతదేహాలు నుజ్జనుజ్జయి కనిపించాయి. దీపావళి పర్వదినం నాడే ఈ దుర్ఘటన సంభవించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.
విచారణకు ఆదేశం...
ఈ దుర్ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ నిర్వహించాలని రైల్వేశాఖ ఆదేశాలు జారి చేసింది. నిబంధనల ప్రకారం ట్రాక్‌ను పరిశీలించాకే మరమ్మతులు ప్రారంభించాలి. మరమ్మతులు చేస్తున్న సమయంలో రైల్వే ఉద్యోగులు ఇద్దరు దూరంగా నిలబడి రైలు వస్తే వారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించాలి. విజిల్ వేసి మరి హెచ్చరించాలి. అదే విధంగా ఒక్కోసారి ఎరుపు జెండా ఊపి రైలును కూడా ఆపుతుంటారు. కానీ నలుగురు గ్యాంగ్మెన్లు పనులు చేస్తున్నప్పుడు అక్కడ ఇలాంటి హెచ్చరికలు చేసే ఉద్యోగులు ఉన్నారా..? లేదా..? అనే విషయాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ రైలు డ్రైవర్ దృష్టికి కూడా రాలేదా..? వంటి ఇతర విషయాలపైనా విచారణ నిర్వహిస్తామని రైల్వేవర్గాలు తెలిపాయి.