యూకీ సంచలనం
కర్షి: ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న కర్షి చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రి సంచలనం సృష్టించాడు. అన్సీడేడ్గా బరిలోకి దిగిన యూకీ తనకంటే ఎంతో మెరుగైన ర్యాంకు ఉన్న టాప్‌సీడ్, సెర్గీ స్టాఖోవ్స్కీ (ఉక్రెయిన్)పై గెలుపొందాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 273వ ర్యాంకర్ యూకీ 6–2, 6–4తో స్టాఖోవ్స్కీపై అలవోకగా గెలుపొందాడు.
టాప్–100 ప్లేయర్‌ను ఓడించడం యూకీకిది ఈ సీజన్లో తొలిసారి కావడం విశేషం. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. ఓవరాల్‌గా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన యూకీ సంచలన విజయం సాధించాడు. సెమీస్‌లో ప్రపంచ 225వ ర్యాంకర్, ఈగర్ జెరసిమోవ్ (బోస్నియా హెర్జెగోనియా)తో యూకీ తలపడనున్నాడు.