జిల్లాలో హెలెన్ తుపాను నష్టం రూ.88 కోట్లు
సాక్షి, ఏలూరు : అల్పపీడనం నేపథ్యంలో కురి సిన అధిక వర్షాలు, హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన పంట నష్టాల్ని వ్యవసాయ శాఖ లెక్క తేల్చింది. ఈ రెండు ఉపద్రవాల వల్ల రూ.107.59 కోట్లమేర పంట నష్టం వాటిల్లినట్టు ఆ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. భారీ వర్షాలకు రూ.19.59 కోట్ల నష్టం వా టిల్లినట్లు ఇప్పటికే నివేదించిన అధికారులు ‘హెలెన్’ కారణంగా రూ.88 కోట్ల నష్టం ఏర్పడినట్టు తాజాగా నివేదిక పంపారు. నరసాపురం డివిజన్లో8 మండలాల్లోని 37 గ్రామాల్లో హెలెన్ తుపాను ప్రభావం అధికంగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. తుపాను ధాటికి 2 లక్షల 74 వేల 082.5 ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 శాతానికి పైగా పాడైన పంటనే నష్టం జరిగినట్టు లెక్కలోకి తీసుకుంటారు. ఆ విధంగా జిల్లాలో 2 లక్షల 20 వేల ఎకరాలు హెలెన్ తుపాను నష్టం జాబితాలో చేర్చారు. అంతకుముందు వచ్చిన అధిక వర్షాలకు 50 శాతానికి మించి నష్టం జరిగిన పంట ను 50 వేల ఎకరాలుగా గుర్తించారు. పంట నష్ట పరిహారం త్వరగా మంజూరయ్యేలా ప్రయత్నిస్తున్నామని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాస్ తెలిపారు. అయితే ఈ పంట నష్టం లెక్కలపై రైతులు మండిపడుతున్నారు. అధిక వర్షాలు, హెలెన్ తుపానుకు పాడైన పంట వ్యవసాయ శాఖ లెక్కల కంటే రెట్టింపు ఉంటుందని చెబుతున్నారు.