వరంగల్ రైతు వారెవ్వా!
ఖానాపురం(వరంగల్ జిల్లా): కాలం కలిసిరాక, వానలు రాక అన్నదాతలు అతలాకుతలమవుతున్న కష్టకాలంలోనూ వరంగల్ జిల్లా రైతు వేముల వెంకటేశ్వర్రావు అద్భుతమైన ప్రతిభను చాటారు. మొక్కజొన్న పంటను జంటసాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తూ.. జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన వేముల వెంకటేశ్వర్రావు సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ చేతుల మీదుగా 'కృషి ఉన్నతి అవార్డు' అందుకున్నారు.
ఆయన మొక్కజొన్న పంటను జంటసాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తుండటం.. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దృష్టికి వెళ్లింది. మొక్కజొన్న పంటల సాగులో దేశవ్యాప్తంగా రైతుల వివరాలు సేకరించగా, తెలంగాణ రాష్ట్రం నుంచి వేముల వెంకటేశ్వర్రావు ఎన్నికయ్యారు. తాను పండించే పంట విధానాలను ఢిల్లీలో జరిగిన సదస్సులో వివరించినట్లు వెంకటేశ్వర్రావు తెలిపారు.