కీర్తిప్రియకు పురస్కారం
నరసన్నపేట:
నరసన్నపేట కూచిపూడి నృత్యవిద్యాలయం నిర్వాహకురాలు పెంట కీర్తి ప్రియకు రాష్ట్ర కళానిధి పురస్కారం వరించింది. విజయనగరానికి చెందిన గోపీనాథం సాంస్కృతిక సేవా సంస్థ ఈ పురస్కారం అందిస్తుంది. ఈ మేరకు ఆ సంస్థ కమిటీ ప్రతినిధి నాడిశెట్టి శాంతారావు సమాచారం పంపినట్లు కీర్తిప్రియ ఆదివారం తెలిపారు. కూచిపూడి నృత్యకారిణిగా గుర్తింపు పొందడంతో పాటు ఆ కళను పలువురికి ఉచితంగా నేర్పిస్తుండటంతో కమిటీ గుర్తించి ఈ పురస్కారం ప్రకటించిందన్నారు. ఈ నెల 30న విజయనగరంలో పురస్కార ప్రదానం ఉంటుందని కీర్తిప్రియ చెప్పారు. తాను వెంపట చినసత్యనారాయణ వద్ద కూచిపూడి నేర్చుకున్నట్లు వివరించారు. ఇప్పటి వరకూ నాట్యరవళి (విశాఖపట్నం) ఉగాది పురస్కారం, శీరిషా ఫౌండేషన్ బాలమేధావి పురస్కారం, నర్మదా కల్చరల్ అకాడమీ ఇచ్చే నాట్య ప్రవీణ పురస్కారం అందుకున్నట్టు తెలిపారు. అలాగే గోదావరి పుష్కరాల్లో కూడా ప్రత్యేక అవార్డు అందుకున్నట్టు వివరించారు. నరసన్నపేటలో 150 మందికి శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు.