Kuchipudi performances
-
గిన్నిస్‌బుక్‌లోకి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
వేంపల్లె: కూచిపూడి ప్రదర్శన చేసిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కిందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. చెన్నై త్యాగరాజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నైలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన మహా బృంద నాట్య ప్రదర్శనలో పి.తేజేశ్వని, సి.సుష్మిత, కె.దివ్య, కె.ప్రియాంకసాయి, బి.పూజ, సి.తేజద్వీప్, చంద్రశేఖర్, అర్చన, దుర్గ, యశ్వంత్‌కుమార్ పాల్గొని రికార్డుకెక్కినట్లు ఆమె తెలిపారు. గిన్నిస్ రికార్డుతో పాటు ఇండియా రికార్డు, మార్యెటాస్ రికార్డు, హైరేంజ్ రికార్డు, ఫెంటాస్టిక్ రికార్డులు దక్కించుకున్నారని వెల్లడించారు. విద్యార్థులను డైరెక్టర్ సంధ్యారాణితో పాటు ఏవో కొండారెడ్డి, ట్రిపుల్ ఐటీ కూచిపూడి అధ్యాపకులు మొహిద్దీన్ ఖాన్, అధ్యాపక బృందం అభినందించారు. -
సింహళ మయూరం
గౌతమిలో తెలుగుదనం ఉట్టిపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆమె పేరు. ఇంకొకటి ఆమె అభిరుచి. శ్రీలంకకు చెందిన ఈ సింహళ జాతీయురాలికి కూచిపూడిలో చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పడం కన్నా, కూచిపూడి అంటే ఆమెకు ప్రాణం అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆమెకు మన భాష తెలీదు. మన భావం తెలీదు. అయినప్పటికీ కీర్తనలను అర్థం చేసుకుంటూ కూచిపూడిని అభినయిస్తున్నారు. ప్రశంసలూ అందుకుంటున్నారు. భర్త ఉద్యోగరీత్యా రెండేళ్లుగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఉంటున్న గౌతమి ఇటీవలే శ్రీలంకలో కూడా కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చి వచ్చారు. గౌతమి పూర్తి పేరు గౌతమి నిరంజల గమాగే. శ్రీలంకలో ఫైన్ఆర్ట్స్లో డిగ్రీ చేశారు. కొంతకాలం ప్రభుత్వ పాఠశాలలో డ్యాన్స్ టీచర్‌గా ఉన్నారు. పదేళ్ల క్రితం టీవీలో ఎవరిదో కూచిపూడి ప్రదర్శన చూసి ఆమె ఆ నాట్యం వైపు ఆకర్షితురాలయ్యారు. నృత్య భంగిమలు, అభినయమే గాక అందులోని అలంకరణ కూడా ఆ ఆకర్షణకు ఒక కారణమని గౌతమి అంటారు. గౌతమి భర్త కపిల్ సంజీవర్ ఒక కంపెనీలో ఉన్నతోద్యోగి. ‘‘మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి. అబ్బాయి. వైజాగ్ ప్రకృతి అందంతో పాటు ఇక్కడి మనుషుల ఆత్మీయత నాకెంతో నచ్చింది. ఇక్కడికొచ్చిన రెండు నెలల్లోనే సాయినాథ కళాసమితిలో కూచిపూడి శిక్షణకు చేరా. వీకెండ్స్‌ని పూర్తిగా కూచిపూడి నేర్చుకోవడానికి కేటాయించా. నాట్యాచార్యులైన అరుణ్ సాయికుమార్, పేరిణికుమారి దంపతులు సంకీర్తనల్లో భావాన్ని ఇంగ్లిషులో వివరిస్తూ నాకు కూచిపూడి నేర్పించారు. అలా నేర్చుకునే వైజాగ్‌లోని దేవాలయాల్లో ఇప్పటి వరకు పది ప్రదర్శనలు ఇచ్చా. అందరూ నన్ను ప్రశంసిస్తూ ఉంటే ఆ ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇంత స్పందన వస్తుందని నేను ఊహించలేదు’’ అని చెప్పారు గౌతమి. అంతేకాదు, తన స్వదేశం తిరిగివెళ్లిన తర్వాత పూర్తి సమయాన్ని కూచిపూడి శిక్షణ ఇవ్వడానికే వినియోగించే ఉద్దేశంలో ఉన్నారామె. ‘‘దీన్నో దైవకార్యంగా భావిస్తా. మా అమ్మాయి రసంధికీ కూచిపూడిలో శిక్షణ ఇప్పిస్తున్నా. ఆమెను అంతర్జాతీయ స్థాయి నృత్యకారిణిగా చూడాలనేది నా కోరిక’’’ అని గౌతమి అంటున్నారు. - అల్లు సూరిబాబు, సాక్షి, విశాఖపట్నం