ఆంక్షల తూకం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరిదీ
=నూజివీడు డివిజన్లో మినహా చాలాచోట్ల బోణీ కాని వైనం
=జిల్లాలో 93 కేంద్రాల్లో ఐదు కేంద్రాల్లోనే సేకరణ
=కొనుగోళ్లలో నిబంధనలతో ఆవైపే చూడని అన్నదాత
=బయటిమార్కెట్లో రైతులను దోచుకుంటున్న దళారులు
సాక్షి, మచిలీపట్నం : పేరుకే అవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు.. వాస్తవానికి అక్కడ పెట్టే మెలికలతో చికాకు వచ్చిన రైతులు మళ్లీ కమీషన్ ఏజెంట్లకే ధాన్యాన్ని అమ్ముకోక తప్పట్లేదు. ప్రస్తుత సార్వా సీజన్లో దెబ్బతిన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా గత నెల 25న జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో ఐకేపీ ద్వారా 42, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ద్వారా 51 కొనుగోలు కేంద్రాలను తెరిచారు.
విచిత్రం ఏమిటంటే కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు దాటినా ఇప్పటివరకు జిల్లాలో వీటి ద్వారా సేకరించిన ధాన్యం 1100 క్వింటాళ్లు మాత్రమే. నూజివీడు డివిజన్లో 27 కొనుగోలు కేంద్రాలుంటే.. వాటిలో మర్లపాలెం, రెడ్డిగూడెం, చెక్కలపల్లి, కూనపరాజుపర్వ నాలుగు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు బాగున్నాయి. విజయవాడ డివిజన్లో 20 కొనుగోలు కేంద్రాలు తెరిచినా గొల్లపూడి సెంటర్లో మాత్రమే బోణీ అయ్యింది. మచిలీపట్నం డివిజన్లో 30, గుడివాడ డివిజన్లో 16 కొనుగోలు కేంద్రాలు ఉన్నా వాటి దరిదాపులకే రైతులు వెళ్లడంలేదు. ఆ డివిజన్లలో మిల్లర్లదే పైచేయి కావడంతో అయినకాడికి వారికే అమ్ముకుంటున్నారు.
దెబ్బతిన్న పంటకు ధరేదీ?
జిల్లాలో వరుస వైపరీత్యాలతో కుదేలైన రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుకు కష్టమెక్కువ ధర తక్కువ అనే రీతిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అసలే దెబ్బతిన్న పంటను అరకొరగానైనా దక్కించుకునేందుకు హడావుడిగా మాసూళ్లు చేసే రైతాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. అందుకే ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అక్కడ ఇచ్చే ధర తక్కువగా ఉండటంతో పాటు సవాలక్ష ఆంక్షలు పెట్టడం కూడా కారణమని రైతులు చెబుతున్నారు.
తూకంలో ఆంక్షలు...
కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షల తూకంతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ధాన్యం సేకరణకు ఇచ్చిన మార్గదర్శకాల్లో మట్టిబెడ్డలు, రాళ్లు, ఇతర పదార్థాలు ఒక శాతం, రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యం, పురుగుశాతం 4 శాతం వరకు, తప్ప తాలు గింజలు 3 శాతం, ధాన్యంలో మిగిలిన రకాలు కలిసిపోవడం 7 శాతం, తేమ 17 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడి ఉంటేనే బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు చేసేలా ధర నిర్ణయించారు. వరుస విపత్తుల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనలకు లోబడి ధాన్యం లేకపోవడం సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో రైతులు ఆయా కేంద్రాల్లో ధాన్యం నాణ్యత పరిశీలన కోసం పడిగాపులు పడలేక, అక్కడి నిబంధనలు తట్టుకోలేక అయినకాడికి కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లు, దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దళారుల రైతుల పరిస్థితి ఆసరాగా చేసుకొని బస్తాకు రూ.800 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులతో పోల్చితే నాణ్యమైన ధాన్యానికి కాస్త మెరుగైన ధరే లభిస్తున్నా.. విపత్తుల వల్ల నాణ్యత తగ్గిన ధాన్యం విషయంలో రైతులు దళారులు చెప్పిన ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలతో అమ్మకాలు వేగం
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవటం వల్ల బయట మార్కెట్లో ధాన్యం ధర దక్కేలా చేయగలిగాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో కొనేలా మార్గదర్శకాలు ఉన్నాయి. బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరను నిర్ణయించాం. దీని వల్ల బయట మార్కెట్లో అదనపు ధరకు రైతు అమ్ముకునే అవకాశం వచ్చింది. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేసేలా చర్యలు తీసుకున్నాం.
- చిట్టిబాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్
మొక్కుబడి కేంద్రాలు...
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడని మొక్కుబడి కేంద్రాలుగానే మారాయి. అక్కడ పెట్టే ఆంక్షలతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. గత్యంతరంలేని స్థితిలో రైతులు కమీషన్దారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. నిబంధనలు సడలించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
- ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్
నిబంధనల్లో సడలింపు ఏదీ
నష్టపోయిన పంటల్ని జిల్లాలో పరిశీలించిన కేంద్ర బృందం ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలిస్తామని చెప్పేసి వెళ్లారు. ఆ తర్వాత నిబంధనల్ని సడలించామన్న ఒక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రానే లేదు. రంగుమారిన, సగం పాలుపోసుకున్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే ఒక్క గింజ కూడా కొనుగోలు కేంద్రానికి తోలే అవకాశమే లేదు.
- పెన్నేరు ప్రభాకర్, వడ్లమన్నాడు రైతు క్లబ్ కన్వీనరు