గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా
– ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
– సురక్షితంగా బయటపడ్డ ఐదు మంది
చింతకొమ్మదిన్నె : మండలంలోని కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు, 4వ మలుపు వద్ద గురువారం వరి గడ్డి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మంది సురక్షితంగా బయటపడ్డారు. చాపాడు మండలం రేపల్లె గ్రామానికి చెందిన వారు ఏపీ03 టియు 2739 నెంబరు గల లారీలో గాలివీడు నుంచి వరి గడ్డిని కొనుగోలు చేసి తీసుకొస్తుండగా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని నాలుగవ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో జక్కల రామసుబ్బయ్య (55), గూడె శ్రీనివాసులు (45) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఓనర్ జయన్న, దస్తగిరి అలియాస్ టీకన్న తీవ్ర గాయాలపాలయ్యారు. 5 మంది ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్,సీకే దిన్నె ఎస్ఐలు కుళాయప్ప, చాంద్‌బాషా, రాయచోటి సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడ్డ లారీలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. బోల్తా పడ్డ లారీని పక్కకు తొలగించారు.