3 ఈఎస్ఐ ఆస్పత్రులు
కార్మిక వైద్య సేవలు మరింత విస్తృతం
ఒక్కో ఆస్పత్రికి రూ.100 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆస్పత్రులకు స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కార్మిక శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ద్వారా అందే వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. అత్యాధునిక సదుపా యాలతో వైద్య సేవల్ని విస్తృత పర్చాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఆస్పత్రుల ఏర్పాటుకు ఉపక్రమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈఎస్ఐ పరిధిలో 10.57లక్షల మంది ఉన్నారు. వీరికి 4 ప్రధాన ఆస్పత్రులు, 70 డిస్పెన్స రీల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. తాజాగా ఈఎస్ఐ పరిధిని పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు రూ.15వేల లోపు వేతనమున్న కార్మికులకు మాత్రమే సేవలందుతుండగా... ఇకపై రూ..21వేల లోపు వేతనమున్న కార్మికులందరికీ ఈఎస్ఐ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. దీంతో ఆస్పత్రుల సంఖ్యను పెంచాల్సి ఉండడంతో కార్మిక శాఖ ఈమేరకు అడుగులు వేస్తోంది.
కొత్తగా మూడు పెద్దాసుపత్రులు...
రాష్ట్రంలో కొత్తగా మూడు చోట్ల ప్రధాన ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌లోని గోషామహల్, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, వరంగల్ కేంద్రంలో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఆస్పత్రి వంద పడకల సామర్థ్యంతో నిర్మాణం కానుంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.100 కోట్ల చొప్పున మొత్తంగా రూ.300 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఆస్పత్రిని ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకుగాను స్థలాన్ని కేటాయిం చాలని కార్మికశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
ఎనిమిది డిస్పెన్సరీల స్థాయి పెంపు
కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు మరో ఎనిమిది డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయాలని కార్మిక రాజ్య బీమా సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఈఎస్ఐ పరిధి పెంపు నేపథ్యంలో డిస్పెన్సరీల అప్‌గ్రెడేషన్‌కు సర్కారు పచ్చజెండా ఊపింది. వీటిలో వికారాబాద్ జిల్లా తాండూరు, మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్, నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, సిద్దిపేట్, ఖమ్మం, సూర్యాపేట్ డిస్పెన్సరీలున్నాయి. త్వరలో ఇవి ఆరుపడకల ఆస్పత్రులుగా మారనున్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.10 కోట్ల చొప్పున కార్మిక శాఖ నిధులిస్తోంది. మిగతా మొత్తాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల నిధుల నుంచి వినియోగిం చుకునేలా ఆ శాఖ ప్రణాళికలు తయారు చేస్తోంది. విడతల వారీగా రాష్ట్రంలోని అన్ని డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేయ నున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గతవారం ప్రకటించారు.