ప్రతీకార దాడులు ఆపాలని పాక్ వేడుకుంది
రక్షణ మంత్రి పరీకర్ వెల్లడి
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ది అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు పట్టుకునే తీరని మరోసారి రుజువైంది. పాక్ సైన్యం గత మంగళవారం సరిహద్దుల్లో దాడులకు పాల్పడి భారత సైనికుడి తలను అత్యంత పాశవికంగా నరికి వేయడం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత సైన్యం ఆ మరుసటి రోజు పూంచ్, రాజౌరి, కెల్, మచిల్ సెక్టార్లలో ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై భారీ మోర్టార్లతో దాడులు జరిపింది. దీంతో గుక్క తిప్పుకోలేకపోతున్న పాక్.. ప్రతీకార దాడులు వద్దంటూ భారత్‌ను వేడుకుంది. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ శుక్రవారం గోవాలో తెలిపారు. ‘పాక్ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. దీంతో భయపడి ప్రతీకార దాడులను నిలిపేయాలని కోరుతూ పాక్ నుంచి మొన్న(బుధవారం) వేడుకోలు వచ్చింది’ అని ఆయన తెలిపినట్టు ఓ వార్తాసంస్థ పేర్కొంది. దాడులు చేయాలని తమకేమీ ఆసక్తి లేదని, అందువల్ల ఆపడానికి తమకేమీ అభ్యంతరం లేదని, అరుుతే ముందుగా కవ్వింపు చర్యలు ఆపాలని తాను పాక్‌కు సూచించినట్టు తెలిపారు. దీని ఫలితంగా గత రెండు రోజులుగా సరిహద్దు వెంబడి కాల్పులు ఆగిపోయాయన్నారు.
పెద్దనోట్ల రద్దుతో తగ్గిన నేరాలు: పరీకర్
పణజి: పెద్దనోట్ల రద్దుతో ముంబైలో నేరాల రేటు దిగొచ్చిందని పరీకర్ చెప్పారు. హత్యలు, బలవంతపు వసూళ్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. శనివారం గోవాలోని ఆల్డోనాలో జరిగిన బీజేపీ సభలో మాట్లాడుతూ, ‘ తాను అధికార బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారును వదిలి సాధారణ కారునే వాడుతున్నానని, ధైర్యముంటే శత్రువులెవరైనా తనను షూట్ చేయవచ్చని పరీకర్ సవాల్ విసిరారు.