తండా వాసి.. పరిశోధనల్లో మెరిసి
ఫార్మసీ రంగంలో ప్రతిభచూపుతున్న గిరిజన విద్యార్థి
డయాబెటిస్, వెన్నునొప్పి మందులపై పలు పరిశోధనలు
మారుమూల తండా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగిన శ్రీనివాస్
ఇంటర్ పూర్తికాగానే చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు పూర్తి చేసి ప్రశాంతంగా జీవించాలని కలలుగంటుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సుల వైపు వెళ్లకుండా డిఫరెంట్ విభాగాన్ని ఎంచుకున్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఫార్మసీ విద్యను అభ్యసించాడు. వినూత్న పరిశోధనలు చేస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి మహత్కార్యాన్ని అయినా సాధించవచ్చని చెబుతున్న గిరిజన విద్యార్థి ‘లావుడ్యా శ్రీనివాస్’పై ప్రత్యేక కథనం.
పాలకుర్తి : పుట్టింది మారుమూల తండాలో అయినప్పటికీ ఓ గిరిపుత్రుడు చదువులో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ ఆయన క్రమశిక్షణతో విద్యనభ్యసించి కన్నవారి కలలు నెరవేర్చాడు. వివరాల్లోకి వెళితే.. పాలకుర్తి మండలంలోని కొండాపురం గ్రామ శివారు పెద్ద తండాకు చెందిన లావుడ్యా దేవానాయక్–బుజ్జి దంపతుల మొదటి కుమారుడు శ్రీనివాస్ ఫార్మసీ రంగంలో సత్తాచాటుతున్నాడు. 1 నుంచి 10వ తరగతి వరకు పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో, వరంగల్‌లో ఇంటర్, బీ ఫార్మసీ చదివిన శ్రీనివాస్ పంజాబ్ రాష్ట్రం చంఢీగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ (ఎంఎస్ ఫార్మ) పూర్తి చేశాడు.
డయాబెటిస్ మందులపై పరిశోధన..
శ్రీనివాస్ ఎంఎస్ ఫార్మ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే పలు పరిశోధనలు చేశాడు. ఇందులో భాగంగా 2014 నవంబర్ 21 నుంచి 24 వరకు సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ‘డయాబెటిస్ న్యూరోపతి’ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఈ సదస్సుకు భారతదేశం నుంచి విద్యార్థి ప్రతినిధిగా శ్రీనివాస్‌కు మాత్రమే అవకాశం రావడం గమ నా ర్హం. 2015 సంవత్సరంలో యూఎస్ఏలోని బోస్టన్ సిటీలో జరిగిన ఫార్మాసుయో పియోమెడియాలజీ (ఐసీపీఈ) అంతర్జాతీయ సదస్సుకు కూడా భారతదేశం తరపున పాల్గొని పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. వీటితోపాటు పలు జాతీయ సదస్సుల్లో తాను చేసిన పరిశోధనలనలపై ప్రజెంటేషన్ ఇచ్చి నిర్వాహకుల మన్ననలు పొందాడు. శ్రీనివాస్ ప్రస్తుతం ఛండీగర్‌లోని అంతర్జాతీయ ఎం ఎన్సీ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మరిన్ని పరిశోధనలు జరగాలి
ఫార్మసీ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగి పేద ప్రజలకు ఫలితాలు అందాలి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మధుమేహ వ్యాధిని నియంత్రించేందుకు తాను కొన్ని పరిశోధనలు చేసి సమాచారం సేకరించాను. సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ ఫా ర్మసీ సదస్సులో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాను. డయాబెటీస్ నివారణకు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాల్సిన మందుల విష యాన్ని అక్కడ వివరించాను. వెన్నెముక నొప్పి రావడానికి గల కారణాలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికాలో జరిగిన అంతర్జాతీయ ఫార్మసీ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ రెండు సదస్సుల్లో నేను ఇచ్చిన ప్రజెంటేషన్‌ను నిర్వాహకులు ఆమోదించారు.
లావుడ్యా శ్రీనివాస్, పరిశోధకుడు, పెద్దతండా
మాకు సంతోషంగా ఉంది
మా కుమారుడు శ్రీనివాస్ చదువులో ప్రతిభ కనబరుస్తుండడంతో అందరూ అభినందిస్తున్నారు. తండా పేరును విదేశాల వరకు తీసుకెళ్లడం సంతోషంగా ఉంది. శ్రీనివాస్ భవిష్యత్‌లో మరిన్ని పరిశోధనలు చేసి తండాకు, దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం.
–లావుడ్యా దేవానాయక్–బుజ్జి (శ్రీనివాస్ తల్లిదండ్రులు)