టీడీపీలో చేరికల లొల్లి !
► ఇంతియాజ్ చేరికతో అలిగిన రామకృష్ణారెడ్డి
►బుజ్జగించేందుకు మంత్రి విఫలయత్నం
►ఏవీ సుబ్బారెడ్డితో రాయబారం పంపాలని ప్రయత్నం
►ససేమిరా అన్న ఏవీ
కర్నూలు: అధికార పార్టీలో చేరికల లొల్లి మొదలైంది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న తమను కనీసం సంప్రదించకుండానే కొత్త వారిని చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల నేషనల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మద్‌ను అధికార పార్టీ చేర్చుకుంది. నేరుగా సీఎం సమక్షంలో ఆయన్ను చేర్చుకోవడం, తమను కనీసం సంప్రదించకపోవడంపై రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి అలిగినట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
పార్టీకి కట్టుబడి ఉన్న తనను కనీసం అడగకుండానే ఇంతియాజ్‌ను చేర్చుకోవడంపై రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి గురికావడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా మంగళవారం మొత్తం ఇంటికే పరిమితమైనట్లు సమాచారం. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి అఖిలప్రియ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డితో మాట్లాడించాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించగా.. ఇందుకు ఏవీ విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డి కూడా అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే.
ఫలించని బుజ్జగింపులు
స్థానిక పరిస్థితులు తెలియకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి మంత్రి అఖిలప్రియ పార్టీలో చేరికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే తరహాలో ఇంతియాజ్ చేరికపై రామకృష్ణారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ ప్రయత్నించారు. అయితే, ఆయన చల్లబడలేదని సమాచారం. ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో తమకు ఏమి విలువ ఉంటుందని వాపోతున్నారు.
అదే బాటలో ఏవీ.. రామకృష్ణారెడ్డిని మంత్రి ఎంతగా బుజ్జగించినా ఫలితం లేకపోవడంతో తుదకు ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించేందుకు టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. అయితే, ఇందుకు ఏవీ అంగీకరించలేదని తెలిసింది. తనకు కూడా ఇదే తరహాలో అవమానం జరుగుతుంటే.. ఇక తాను ఏ విధంగా రామకృష్ణారెడ్డిని బుజ్జగించగలనని ఆయన వాపోయినట్టు సమాచారం.
స్థానిక నేతలను పూర్తిగా పక్కనపెట్టి.. బయటి నుంచి వచ్చిన మంత్రులతో మొత్తం వ్యవహారాలు నడిపిస్తుంటే ఇక తామెందుకు ఉండటమన్న రీతిలో పలువురు అధికార పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని గ్రామాలతో పాటు నంద్యాల పట్టణంలో కూడా పలువురు నేతల మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ విభేదాలతో అసలుకే మోసం వచ్చి పాత నేతలు జారుకునే ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.