‘లెహర్’ కలవరం
ఖమ్మం, న్యూస్‌లైన్: రోజంతా ఆకాశం మేఘావృతం..‘లెహర్’ ప్రభావంతో చిరుజల్లులు..పంటలు తలచుకుని రైతుల ఆందోళన.. ఆకాశంకేసి చూడటం.. వర్షం రాకుంటే బాగుండని మొక్కడం..గురువారం జిల్లాలో పరిస్థితి ఇది. ఇప్పటి కే తుపానులతో పంటలను కోల్పోయిన రైతులు మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని ఒకటే ఆందోళన. చేతి కొచ్చిన పంటలను ఇప్పటికిప్పుడు ఏమి చేసేదిలేక భగవంతుడిపై భారం వేసి..ఆకాశం కేసి చూశారు. తుపాను ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో వర్షాలు పడే అవకాశం ఉందని న్యూస్‌చానల్స్‌లో విన్నది మొదలు ఒకటే దిగులు. జూలైలో వచ్చిన గోదావరి వరదలు, తుపాను, ఇతర వర్షాలతో జిల్లా రైతులు నిలువునా నష్టపోయారు.
అన్ని కష్టాలను చవిచూసి ప్రకృతి బీభత్సంతో నీటమునిగిన పంటలు పోను మిగిలిన పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. కోతకు వచ్చిన వరి పొలాలు, కోసిన వరి పనలు, రెండో దశలో ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి, ఏపుగా కాసిన మిర్చి, కూరగాయ పంటలను చూసుకొని రైతులు ఆనందంతో ఉన్న సమయంలో మళ్లీ తుపాను గండం పొంచివుందనే సమాచారం రైతులను ఖిన్నులను చేసింది. శుక్రవారం కూడా ఇదేరకమైన వాతావరణ పరిస్థితులు ఉండొచ్చని తెలుస్తుండటంతో నిశ్చేష్టులవుతున్నారు. వర్షార్పణం కాకముందే కొద్దిగొప్ప పంటలను చక్కబెట్టుకుందామని భావించి కొందరు రైతులు పత్తి తీత, వరి కుప్పలు వేయడం, వరి పొలాల్లో నీటిని బయటకు పంపడం వంటి పనుల్లో బిజీబి జీగా ఉన్నారు. అధిక కూలి ఇచ్చి కూలీలను రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని మీద భారం వేసి తుపాను గండం నుంచి గట్టెక్కించమని కోరుతున్నారు.