ఆర్మీ కల్నల్ అఘాయిత్యం
ఆగ్రా: వాళ్లిద్దరూ ఇండియన్ ఆర్మీలో మంచి హోదాలో పనిచేస్తున్నారు. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఎందుకోగానీ ఈ మధ్యే విడిపోయారు. వీడ్కోలు తీసుకునేక్రమంలో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. అక్కడ సహచర లెఫ్లినెట్ పై బలాత్కారానికి దిగిన కల్నల్.. చివరికి విషపు ఇంజెక్షన్ పొడుచుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్మీ వర్గాల్లో సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రకు చెందిన టి.జాదవ్(40) ఆర్మీలో లెఫ్టినెట్ కల్నల్. ఆగ్రా ఆర్మీ ఆసుపత్రిలో అనస్తీషియా నిపుణుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. డెహ్రాడూన్ కు చెందిన మహిళా లెఫ్టినెంట్.. అదే ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది. గడిచిన రెండేళ్లుగా ఈ ఇద్దరూ సహజీనం చేస్తున్నారు. జాదవ్ కు ఇదివరకే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే జాదవ్ తో సంబంధాలు తెంచుకోవాలనుకున్న ఆ జూనియర్ అధికారిణి.. ఇటీవలే అతనికా విషయం చెప్పింది. ఒకేఒక్క లాంగ్ డ్రైవ్ తర్వాత తన నిర్ణయం చెబుతానని అతనన్నాడు.
అనుకున్నట్లే శుక్రవారం రాత్రి యమునా తీరంలో లాంగ్ డ్రైవ్ కు వెళ్లారు. మథుర సమీపంలోని రాధా నగర్ కు చేరుకున్నాక, వెంట తెచ్చుకున్న విషపు ఇంజెక్షన్ ను బయటికి తీసిన జాదవ్.. ఇద్దరం కలిసి చనిపోదామని ఆమెతో అన్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో బలవంతంగా ఇంజక్షన్ పొడిచే ప్రయత్నం చేశాడు. తీవ్ర పెనుగులాత తర్వాత ఆమె కారులో నుంచి బయటికి దిగింది. వెంటనే కారు డోర్లు లాక్ చేసుకున్న జాదవ్.. విషపు ఇంజెక్షన్ ను ఒంట్లోకి పొడుచుకుని చనిపోయాడు.
మహిళా లెఫ్టినెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మథుర ఏఎస్పీ అశోక్ కుమార్ సింగ్ మీడియాకు చెప్పారు. శనివారం ఆర్మీ వైద్యులే జాదవ్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారని తెలిపారు. జాదవ్ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు ఇచ్చారని అశోక్ కుమార్ పేర్కొన్నారు.