జీవన విధానాలు
జీవశాస్త్రం సిలబస్‌లోని మొత్తం ఆరు పాఠ్యాంశాలను ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేస్తే అత్యధిక మార్కులు సాధించొచ్చు.
మొదటి చాప్టర్ ‘జీవన విధానాలు’ నుంచి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 23 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్కు ప్రశ్న, రెండు 2 మార్కుల ప్రశ్నలు, రెండు 4 మార్కుల ప్రశ్నలు, ఒక 5 మార్కుల ప్రశ్న, పది బీ మార్కుల ప్రశ్నలు అడుగుతారు. కచ్చితంగా ఒక పటం (5 మార్కుల ప్రశ్న) అడుగుతారు.
కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లో ముఖ్యంగా ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి. ప్రయోగాల నుంచి ఏటా ఒక 4 మార్కుల ప్రశ్న అడుగుతున్నారు. ప్రయోగాలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు.
1. కిరణజన్య సంయోగక్రియకు కార్బన్‌డైఆక్సైడ్ అవసరమని ఎలా నిరూపిస్తారు?
2. కిరణజన్య సంయోగక్రియలో ఆమ్లజని విడుదలవుతుందని నిరూపించండి?
3. కిరణజన్య సంయోగక్రియకు కాంతి లేదా వెలుతురు అవసరమని ఎలా నిరూపిస్తారు?
4. శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించండి?
కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లో భేదాలకు సంబంధించిన ప్రశ్నలను బాగా అధ్యయనం చేయాలి. భేదాలను ఒకదానితో మరొకటి సరిపోల్చు కొని అధ్యయనం చేస్తే బాగా గుర్తుం చుకోవచ్చు.
భేదాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు:
1. ఆక్సీకరణం, క్షయకరణంల మధ్య భేదాలు రాయండి?
2. మండటం (లేదా) దహనక్రియ, శ్వాస క్రియ మధ్య భేదాలు?
3. కాంతి భాస్వీకరణం,ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్కు మధ్య భేదం ఏమిటి?
4. అవాయు, వాయుసహిత శ్వాసక్రియల మధ్య ఉన్న భేదాలను తెల్పండి?
5. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియల మధ్య భేదాలను రాయండి?
ఈ చాప్టర్లో వచ్చే నిర్వచనాలను బాగా అధ్యయనం చేసినట్లయితే అవి ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలకు ఉపయుక్తమవుతాయి.
ముఖ్యమైన నిర్వచనాలు :
1) జీవక్రియ, 2) కిరణజన్య సంయోగక్రియ, 3) చర్యాకేంద్రం, 4) శ్వాసక్రియ, 5) శ్వాసక్రియాధారాలు, 6) అత్యంత అనుకూల ఉష్ణోగ్రత, 7) కిణ్వనం, 8) జల శ్వాసక్రియ, 9) చర్మ శ్వాసక్రియ, 10) అంగిలి.
పటం చక్కగా గీసి, భాగాలు స్పష్టంగా గుర్తించాలి.
పటానికి 3 మార్కులు, భాగాలకు 2 మార్కులు ఉంటాయి. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ నుంచి ముఖ్యమైన పటాలు.
1. ఆకు అడ్డుకోత పటం గీసి భాగాలను గుర్తించండి?
2. మైటోకాండ్రియా పటం గీసి భాగాలను గుర్తించండి?
3. మానవుని ఊపిరితిత్తుల పటం గీసి భాగాలను గుర్తించండి?
కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ అధ్యాయాల్లోని అంశాలను, నిత్య జీవిత విషయాలకు అన్వయించుకుని చదివితే సులభంగా అర్థం చేసుకోవచ్చు.
1. ఉదాహరణకు కిరణజన్య సంయోగక్రియ వల్ల సమస్త జీవకోటికి ఆక్సిజన్ లభించడం వల్ల మానవ మనుగడ సాధ్యం అవుతోంది. ఈ ప్రక్రియ వల్ల కలప, వంటచెరకు, బొగ్గు, పెట్రోల్, ఔషధాలు మొదలైన అనేక విలువైన పదార్థాలు కూడా లభ్యమవుతాయి.
2. కిణ్వనం చర్యను ఆల్కహాలు ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మన నిత్య జీవితంలో ఇడ్లీ, దోసెల పిండి పులియడం కూడా కిణ్వన ప్రక్రియే.
ముఖ్యమైన ప్రశ్నలు
1. జీవక్రియ అంటే ఏమిటి?
జ. జీవి మనుగడకు, దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవక్రియ అంటారు.
ఉదా: పోషణ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి.
2. కిరణజన్య సంయోగక్రియను నిర్వచించండి?
జ. ఆకుపచ్చ మొక్కల్లో ఉండే హరితరేణువులు కార్బన్‌డైఆక్సైడ్, నీటిని ఉపయోగించి కార్బోహైడ్రేట్స్‌ను తయారుచేసే కాంతి రసాయన చర్యను కిరణజన్య సంయోగక్రియ అంటారు.
3. చర్యా కేంద్రం అంటే ఏమిటి?
జ. హరితరేణువులో థైలకాయిడ్ త్వచంపై నిర్మితమై ఉండే పత్రహరితం దాని అనుబంధ వర్ణద్రవ్య అణువులు చర్యాకేంద్రాలుగా నిర్మితమై ఉంటాయి. ఈ కేంద్రాలు కాంతిచర్యవ్యవస్థ ఐ, కాంతిచర్య వ్యవస్థ ఐఐ అని రెండు రకాలు.
4. శ్వాసక్రియను నిర్వచించండి?
జ. ఆహార పదార్థాలైన గ్లూకోజ్, కొవ్వు ఆక్సీకరణం చెంది కార్బన్ డై ఆక్సైడ్, నీరుగా మారి శక్తిని విడుదల చేసే క్రియను శ్వాసక్రియ అంటారు.
5. శ్వాసక్రియాధారాలు అంటే ఏమిటి?
జ. శ్వాసక్రియలో ఆక్సీకరణ చెంది శక్తి విడుదల చేసే పదార్థాలను శ్వాసక్రియాధారాలు అంటారు.
ఉదా: కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు