శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు కలేనా?
నిధుల కొరతే ప్రధాన అడ్డంకి
ముందుకు కదలని ప్రతిపాదనలు
బెజవాడ స్టేషన్‌కు తప్పని రద్దీ
సాక్షి, విజయవాడ : దక్షిణ భారతదేశంలోనే కీలక రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడలో శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి కలగానే మిగులుతోంది. ఈ స్టేషన్‌కి ఉన్న రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయంగా శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని 2010లో రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం గుణదల, సింగ్‌నగర్, రాయనపాడు ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్థలాల పరిశీలన కూడా జరిగింది. నిధుల కొరత కారణంగా ఇది ఆచరణకు నోచుకోలేదు. గత రెండేళ్లుగా రైల్వేలో అభివృద్ధి పనులకు కేటాయిస్తున్న బడ్జెట్ గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే టెండర్లు ఖరారైన పనులు కూడా నిధుల వెసులుబాటు చూసుకుని చేస్తున్నారు. ఈ తరుణంలో అదనపు నిధులు రాకుండా ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.
సరిపోని ప్లాట్‌ఫారాలు...
విజయవాడ రైల్వేస్టేషన్లో పది ప్లాట్‌ఫారాలు ఉన్నా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది మాత్రం ఏడే.
ఈ స్టేషన్ మీదుగా రోజుకు 350 వరకు రైళ్లు, గూడ్స్‌లు ప్రయాణిస్తుంటాయి.
రోజూ 180 వరకు పాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తుండగా అందులో ఎక్కువ భాగం రైళ్లను ఒకటి నుంచి ఏడు ప్లాట్‌ఫారాలపైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది.
దీంతో 8, 9, 10 ప్లాట్‌ఫారాలు బోసిపోతున్నాయి. 2004 పుష్కరాల సమయంలో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఈ ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేశారు.
వీటికి గుంటూరు, తెనాలి, ఖాజీపేట నుంచి రైళ్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడి నుంచి ఖాజీపేట, విశాఖపట్నం వెళ్లే అవకాశం లేదు. దీంతో ప్రధానమైన రైళ్లన్నింటినీ ఒకటి నుంచి ఏడు ప్లాట్‌ఫారాలకే పరిమితం చేయాల్సి వస్తోంది.
శివారు ప్రాంతాల్లో రైళ్లను రాత్రి వేళల్లో ఎటువంటి రక్షణ లేకుండా నిలపవడం ప్రమాదకరం. రాజరాజేశ్వరీపేట వంటి ప్రాంతంలో రైలును నిలిపిన సమయంలో ఎవరైనా దోపిడీకి పాల్పడినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఎటువంటి ఘటనలూ జరగకపోవడం తమ అదృష్టమేనని రైల్వే అధికారులే అంగీకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము చేయగలిగింది కూడా ఏమీ లేదని వారు చెబుతున్నారు.
భవిష్యత్‌లో మరిన్ని రైళ్లు పెరిగే అవకాశం ఉండటంతో 8, 9, 10 ప్లాట్‌ఫారాలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంతో పాటు శాటిలైట్ స్టేషన్ల ఏర్పాటు తప్పనిసరి కానుంది.
శాటిలైట్ స్టేషన్ ఎందుకంటే..
శాటిలైట్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని రైళ్లను విజయవాడ జంక్షన్‌కు రాకుండా చేయవచ్చు.
హౌరా, చెన్నై, ముంబై వంటి నగరాల్లో ఈ శాటిలైట్ స్టేషన్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే రైళ్లను విజయవాడ స్టేషన్‌కు రాకుండా శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి ద్వారా నేరుగా వెళ్లేలా చేయాలన్నది అధికారుల ప్రతిపాదన.
ఇప్పటికే గూడ్స్ రైళ్ల కోసం ఉన్న లూప్‌లైన్‌ను పటిష్టపరచడం ద్వారా దీన్ని అమలు చేయవచ్చని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు.
విజయవాడ డీఆర్ఎంగా అనురాగ్ ఉన్న సమయంలో ఆయన గుణదల స్టేషన్‌ను పరిశీలించి వచ్చారు. అక్కడ విస్తరణకు స్థలం సరిపోదని నిర్ణయించారు.
అనంతరం సింగ్‌నగర్ ఫ్లైవోవర్ వద్ద దీన్ని ఏర్పాటు చేయడం కోసం పరిశీలించారు.
మరో ప్రతిపాదనలో భాగంగా రాయనపాడు వద్ద రైల్వే స్థలం కావాల్సినంత ఉండటంతో అక్కడ ఏర్పాటు కోసం పరిశీలన జరిపారు.
ఈ ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపారు.
విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు విజయవాడ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఇంజన్ వెనక్కి మార్చి మళ్లీ వెనక్కి పంపాల్సి ఉంటుంది. దీనివల్ల 20 నిమిషాల సమయం వృథా అవుతోంది.
అదే శాటిలైట్ స్టేషన్లు అభివృద్ధి అయితే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు రైల్వే జంక్షన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపి వచ్చే బడ్జెట్లోనైనా వీటికి నిధులు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.