కంపెనీల వీఆర్ఎస్ బాట
న్యూఢిల్లీ: కాలానుగుణంగా బిజినెస్ వాతావరణంలో ఏర్పడే మార్పులను ఎదుర్కోవడం, వ్యయాల ఆదుపు వంటి చర్యలను చేపట్టే బాటలో ఇటీవల కంపెనీలు తమ ఉద్యోగులకు స్వచ్చంద పదవీ విరమణ(వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెడుతున్నాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఫార్మా, ఎరువులు, రసాయనాలు, స్టీల్, టెక్స్టైల్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీలు అత్యధిక స్థాయిలో వీఆర్ఎస్ను అనుసరిస్తున్నాయి.
మాన్సెర్ కన్సల్టింగ్ విడుదల చేసిన రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. కాగా, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకునేందుకు ప్రధానంగా కంపెనీలు వీఆర్ఎస్ బాట పడుతున్నాయని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ వీఆర్ఎస్ను ప్రవేశపెట్టే కంపెనీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అశోక్ లేలాండ్, నోకియా, టాటా మోటార్స్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ను ఆఫర్ చేయడం గమనార్హం.
పునర్వ్యవస్థీకరణ వ్యూహం
గరిష్ట స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనయ్యే రంగాలలోని కంపెనీలు ప్రధానంగా వీఆర్ఎస్ను చేపడుతున్నాయని రాండ్‌స్టాండ్ ఇండియా సీఈవో మూర్తి కె.ఉప్పలూరి చెప్పారు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయని వివరించారు. దశాబ్దంకిందటి పరిస్థితుల తో పోలిస్తే ప్రస్తుతం వీఆర్ఎస్ అమలు చేయడం అధికమైందని తెలిపారు. బిజినెస్‌లలో స్థిరత్వం ఏర్పడేటంతవరకూ రానున్న కొద్ది త్రైమాసికాలపాటు ఈ ట్రెండ్ కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ లైట్‌హౌస్ పార్టనర్స్‌కు చెందిన మేనేజింగ్ పార్టనర్ రాజీవ్ బర్మన్ సైతం వ్యక్తం చేశారు. మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను లక్ష్యంగా చేసుకుని వీఆర్ఎస్ ను కొనసాగిస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ కంపెనీలు పనితీరును మెరుగుపరచుకునేందుకు వీఆర్ఎస్ అమలును చేపట్టాల్సి వస్తుందన్నారు.