బాలికపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితులను అరెస్టు చేయండి
రాయచూరు, న్యూస్‌లైన్ : లింగసూగూరు తాలూకా రామదుర్గకు చెందిన మైనర్ బాలిక బసమ్మపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో హట్టి పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర రైతు సంఘం, వివిధ కార్మిక సంఘాల అధ్యక్షుడు ఆర్.మానసయ్య ఆరోపించారు.
గురువారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలి తల్లిదండ్రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ కేసును మూసివేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. దట్టమైన అరణ్యంలో బసమ్మపై అదే గ్రామానికి చెందిన నాగప్ప లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. అనంతరం ఓ చెట్టుకు ఆ బాలికను వేలాడదీశారని వివరించారు. అన్నతో కలిసి గొర్రెలు కాయడానికి వెళ్లిన బాలిక సాయంత్రానికి శవమైందని,బాలికను వేలాడదీసిన చెట్టును అప్పటి ఎస్ఐ ప్రకాష్మాళె నరికేయించాడన్నారు.
రాత్రికి రాత్రే పోస్టుమార్టం చేయడం వంటివి కేసు మూసివేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చుతాయన్నారు. బసమ్మ ఒక్కటే కాదు, ఆ ప్రాంతంలోని గౌడూరు తండా, నిలోగల్ ఆశాల తండ , కుప్పిగడ్డలలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. బసమ్మ కేసును మూసి వేసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పి తక్షణమే నిజాయితీగల అధికారితో దర్యాప్తు చేయించి, నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో కరియప్ప, లింగప్ప, పరమేశ్ తదితరులున్నారు.