హైసెక్యూరిటీ ప్లేట్లు జారీలో నిర్లక్ష్యం
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ చేయడంలో లింక్ ఆటో టోక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్లక్ష్యం వహిస్తోంది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాటిలో 20 శాతం వాహనాలకు కూడా హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చలేదు. వేలల్లో వాహనాలు రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వందల సంఖ్యలో కూడా వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. వాహన యాజమానులకు అవగాహన కల్పించడంలో ఆ సంస్థ విఫలమైంది.
హైసెక్యూరిటీ ప్లేట్ ఉన్న వాహనం దొంగతనానికి గురైతే లేబర్ కోడ్ ఆధారంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అన్ని వాహనాలకు ఒకే విధమైన ప్లేట్లు ఉంటాయి. ఎటువంటి రాతలకు ఆస్కారం ఉండదు. 2014 మార్చి ఒకటో తేదీన రవాణా శాఖ కార్యాలయంలో హైసెక్యూరిటీ ప్లేట్లు జారీ పక్రియ ప్రారంభమైంది. మార్చి ఒకటో తేదీ నుంచి ఇంతవరకు 3500 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ఇంతవరకు 237 వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ ప్లేట్లను అమర్చారు.
ఆసక్తి చూపని వాహనదారులు
హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటుకు వాహనదారులు ఆసక్తి కనబరచడం లేదని లింక్ ఆటోటెక్ ప్రవేట్ లిమిటెడ్ సూపర్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. టువీలర్ వాహనాలకు హైసెక్యూరిటీ ప్లేట్‌కు 245, ఫోర్ వీలర్ వాహనాలకు 619 ఫీజు వసూలు చేస్తున్నామన్నారు. దీనిపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.