‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’లో భారత అందాలు!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్లో మనదేశంలోని అన్ని నగరాలు, పర్యాటక ప్రాంతాలు, పర్వతాలు, నదుల అందాలను 360 డిగ్రీల కోణంలో, 3డీలో అత్యంత స్పష్టంగా, కళ్లకు కట్టేలా వీక్షించే సదుపాయం త్వరలో లభించనుంది. రక్షణ రంగ నిర్మాణాలు, అణు కార్యక్రమ ప్రదేశాలు, కొన్ని ఇతర అత్యంత సున్నిత ప్రాంతాలను మినహాయించి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలను ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రముఖ ఇంటర్నెట్ సేవల సంస్థ గూగుల్‌కు అనుమతినివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, పీఎంఓ శాఖల ఉన్నతాధికారులు దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించారని, గూగుల్‌కు లాంఛనంగా ఈ సమాచారాన్ని త్వరలో అందించనున్నారని మంగళవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘గూగుల్ స్ట్రీట్ వ్యూ’ ద్వారా ప్రపంచంలోని అనేక ప్రాంతాల సజీవ దృశ్యాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అమెరికా, కెనడా, పలు యూరోప్ దేశాల్లో దీన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ పరిమిత స్థాయిలో ఇది అందుబాటులో ఉంది.
తాజ్‌మహల్, ఎర్రకోట, కుతుబ్‌మినార్, వారణాసి నదీ తీరం, నలంద యూనివర్సిటీ, మైసూర్ రాజమందిరం, తంజావూరు దేవాలయం, చిన్నస్వామి స్టేడియంతో పాటు కొన్ని ఇతర పర్యాటక ప్రాంతాలను భారత పురావస్తు పరిశోధక శాఖ భాగస్వామ్యంతో గూగుల్ తన ‘స్ట్రీట్ వ్యూ’లో పొందుపర్చింది. స్ట్రీట్ వ్యూ సదుపాయం ఉన్న ప్రాంతాలను ‘గూగుల్ మ్యాప్స్’లోని నీలిరంగు రేఖల ద్వారా గుర్తించవచ్చు.