‘తెలంగాణ’ వీరస్వామి ఇకలేరు..!
అనారోగ్యంతో మృతి
నేడు అంత్యక్రియలు
ముషీరాబాద్ : తెలంగాణనే ఇంటి పేరుగా మార్చుకున్న ఉద్యమ నాయకుడు శనిగరపు వీరస్వామి(44) సోమవారం మృతి చెందాడు. అవివాహితుడైన వీరస్వామి ఏడాది కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. శనివారం రాత్రి దమ్మాయిగూడలోని ఆయన నివాసం నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. జూడాలు సమ్మెలో ఉన్నారని వీరస్వామిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అతడ్ని వెంటనే ఇంటికి తీసుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కాగా అతడి తల్లి దశదిన ఖర్మ రోజునే వీరస్వామి మృతి చెందాడు.
ఉద్యమమే ఊపిరిగా..
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి పోరు బాట పట్టాడు. ఆందోళనల్లో పాల్గొని తెలంగా ణ వాణిని వినిపించారు. కేసీఆర్, కోదండరామ్లతో పాటు తెలంగాణ ఉద్యమంలోని కీలక నేతలందరికీ తెలంగాణ వీరస్వామి సుపరిచితుడు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న 2009 డిసెంబ ర్ 23 నుంచి తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డ జూలై 2, 2014 వరకు అరగుండును టీ ఆకారంలో కత్తిరించుకొని నిరసన తెలిపాడు.
నేడు అంత్యక్రియలు..
వీరస్వామి అంత్యక్రియలు మంగళవారం ఉదయం 11 గంటలకు పార్శిగుట్ట శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు ముషీరాబాద్ జేఏసీ చైర్మన్ ఎం. నర్సయ్య తెలిపారు. వీరస్వామి నివాస ప్రాంతం సమీపంలోని ఎస్సార్టీ పార్క్ నుంచి పార్శిగుట్ట వరకు అంతిమయాత్ర జరుగుతుందని తెలిపారు. అతడి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.