‘బుచ్చిబాబు’ చిరంజీవి
- జీవన కాలమ్
కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు మూడు పారాయణ గ్రంథాలు- కృష్ణశాస్త్రిగారి ‘కృష్ణపక్షం’, బుచ్చిబాబుగారి ‘చిరంజీవి’, చెలంగారి ‘మ్యూ జింగ్స్’. నా జీవితంలో అదృష్టం ఏమిటంటే ఆ ముగ్గురితోనూ అతి సన్నిహితమైన పరిచయాలు ఏర్పడటం. 1960లో ఆంధ్రప్రభలో చిత్తూరులో పనిచేసే రోజుల్లో తరచూ చెలంగారు ఉన్న తిరు వణ్ణామలై ఆశ్రమానికి వెళ్లేవాడిని. మరో మూడేళ్లకి ఆలిండియా రేడియోలో కృష్ణశాస్త్రిగారు, బుచ్చి బాబుగారితో కలసి పనిచేశాను. నేనూ, శంకరమంచి సత్యం, ఉషశ్రీ యువతరం రచయితలం. పెద్దలతో కలసి పనిచేయడం పండగ.
బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ స్ఫూర్తి నూటికి నూరుపాళ్లూ నా మొదటి నవల ‘చీకటిలో చీలికలు’ మీద కనిపిస్తుంది. పుస్తకం పేజీలు చిరిగిపోయేదాకా చదివి ఉంటాను.
బుచ్చిబాబుగారు మితభాషి, మా రేడియో కేంద్రానికి ఎదురుగా అసెంబ్లీ క్యాంటీన్లో భాస్కరభట్ల కృష్ణారావుగారి వీడ్కోలు సభలో మాట్లాడాను. బయటికి వస్తూనే భుజం మీద చెయ్యి వేసి ‘బాగా మాట్లాడావు అబ్బాయ్!’’ అన్నారు బుచ్చిబాబు. నన్ను ‘అబ్బాయ్’ అనే వారు. అదొక పెద్ద కితాబు. ఏదైనా ప్రోగ్రాం బాగా చేస్తే మర్నాడు ముఖం చూసి హార్దికంగా నవ్వేవారు. అదే అభినందన, మాటల్లేవు.
ఒక సందర్భం- నాకు జీవితంలో పాఠం నేర్పిన సందర్భం. రోజూ రేడియోలో ముందురోజు కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక మీటింగు ఉం టుంది. ముందురోజు ప్రసారమయిన బుచ్చిబాబుగారి కార్యక్రమాన్ని ఒక ఉత్త రదేశపు ఆఫీసరుగారు చీల్చిచెండాడాడు. బుచ్చిబాబుగారు సీనియర్ ఆఫీసరు. కాగా గొప్ప రచయిత. మేమందరం ఇబ్బందిగా చూస్తున్నాం. ఆ ఆఫీసరు విమర్శ ముగిశాక అందరం బుచ్చిబాబుగారి సమాధానానికి ఎదురుచూస్తున్నాం. బుచ్చిబాబుగారికి ఉబ్బసం. ఊపిరి కూడతీసుకుని నవ్వి, విమర్శించిన ఆఫీసరు వేపు తిరిగి ‘నా తప్పులు సరిదిద్దుకుంటాను. థాంక్యూ’ అన్నారు. అంతే. చర్చ ముగిసింది.
‘సమాధానం చెప్పరేం?’ అన్నా ను బయటకు వచ్చాక. నవ్వి, ‘ఎందుకూ! మంచి ఉంటే నేర్చుకుందాం. చెడు అయితే మరిచిపోదాం’ అన్నారు. ‘మరి ఆ ఆఫీసరుకి తెలిసేదెలా?’. నవ్వి ‘అది నా పని కాదు’ అన్నారు. అక్కరలేని గుంజాటనకి ‘మౌనం’ చక్కని సమాధానమని నేర్పిన అద్భుతమైన సందర్భమది. ఇప్పటికీ ఆ హితవుని పాటించి నేను మనశ్శాంతిని సమకూర్చుకుంటూంటాను.
బి.ఎన్.రెడ్డిగారి ‘మల్లీశ్వరి’కి బుచ్చిబాబుగారు రాసిన ఒక రేడియో నాటిక మాతృక అని నిరూపణ అయినా కాలుదువ్వని సౌమ్యుడాయన. ప్రశాంతమయిన ఆలోచన, జీవనం సాగించిన వ్యక్తి. ఆయన వాటర్ కలర్ చిత్రాలు అంతే సరళంగా, అంతే పవిత్రంగా, అంతే గజిబిజి లేకుండా కనిపిస్తాయి.
నాకు పాట్నా బదిలీ అయిందని కంట తడిపెట్టుకున్నప్పుడు బుచ్చి బాబుగారు నన్ను అసిస్టెంట్ స్టేషన్ డెరైక్టర్ గదికి తీసుకువెళ్లారు. అప్పుడు ధర్మజ్ఞాని అనే ఆయన మిత్రులు ఆఫీసరు. ఆ కుర్చీలో కూర్చుని నన్ను ఓదార్చి ఉద్యోగం మానవద్దని హితవు చెప్పారు. నేను నటుడినయేదాకా- 20 సంవత్సరాలు ఆ హితవుని పాటించాను.
తీరా నాకు విజయవాడ బదిలీ అయాక, ఇంటికి వెళ్తూ నన్ను పిలిచి భుజం మీద చెయ్యి వేసి, ‘రాత్రి భోజనానికి రా అబ్బాయ్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఆనాడు మాతో భోజనం చేసిన మరో గొప్ప రచయిత మొక్క పాటి నరసింహశాస్త్రిగారు.
వారి శ్రీమతికి (సుబ్బలక్ష్మి గారి వయసు ఇప్పుడు 90) నేనంటే అమితమైన అభిమానం. బెంగళూరులో తమ్ముడి కొడుకు సుబ్బారావుగారి దగ్గర ఉంటున్నారు. రెండేళ్ల కిందట ‘వందేళ్ల కథకు వందనాలు’ కార్యక్రమా నికి బుచ్చిబాబుగారిదీ, ఆమెదీ కథలు రికార్డు చేశాను. ‘మరో రెండేళ్లు బత కాలని ఉంది మారుతీరావ్. బుచ్చిబాబుగారి శతజయంతి చేసి వెళ్లిపోతాను’ అన్నారు. 14న శతజయంతి ఉత్సవం జరిపిస్తున్నారు.
బుచ్చిబాబు ఇంగ్లిష్ ఎమ్మే చదివారు. ఆయన షేక్స్పియర్ మీద రాసిన వ్యాస సంపుటికి ఆయన పోయాక అకాడమీ బహుమతి వచ్చింది. అనా రోగ్యం కారణంగా సర్వీసులో ఉండగానే (51) వెళ్లిపోయారు. కథా సాహిత్యంలో బుచ్చిబాబుగారి ‘నన్ను గురించి కథ వ్రాయవూ?’ ఒక కళాఖండం.
బుచ్చిబాబుగారి జీవితమే ఒక కళాఖండం. ఏమీ అరమరకలు లేని, గజిబిజిలేని, సరళమైన జీవితాన్ని గడిపిన గొప్ప ఇంటలెక్చువల్ బుచ్చి బాబు. ఆయన మంచి కవి. ఆ సాక్ష్యాలు ఇప్పటికీ శివరాజు సుబ్బలక్ష్మిగారి దగ్గర ఉన్నాయి.
- గొల్లపూడి మారుతీరావు
(జూన్ 14న బుచ్చిబాబు శతజయంతి)