పెళ్లి కాలేదని నలుగురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య
పేదరికం ఓ కుటుంబం పాలిట శాపంగా మారింది. కట్నకానుకలిచ్చి పెళ్లిళ్లు చేసే ఆర్థిక స్థోమత లేదనే ఆవేదనతో ఏకంగా నలుగురు అక్కాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకోగా, మరొకరు కొన ఊపిరితో బయటపడ్డారు. ఈ సంఘటన పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రం లోద్రాన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బషీర్ అహ్మద్ రాజ్పుట్ అనే నిరుపేద రైతుకు ఏడుగురు ఆడపిల్లలు. తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఇద్దరికి పెళ్లి చేశాడు. మిగిలిన ఐదుగురు కూతుళ్లు అవివాహితులు.
వారి వయసు 23-35 మధ్య ఉంటుంది. పేదరికం కారణంగా పెళ్లి కాకపోవడం వారిని కలచివేసింది. ఈ విషయమై తండ్రి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కట్నాలిచ్చే స్థోమత తండ్రికి లేదని భావించిన ఐదుగురు అక్కాచెల్లెల్లు ఓ కాలువలోకి దూకారు. నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరిని స్థానికులు రక్షించారు. చనిపోయిన వారిని మునీరా, జెనత్, నజియా, ఫయిజాగా గుర్తించారు. తనలా ఎవరూ ఎక్కువమంది ఆడపిల్లల్ని కనరాదంటూ బషీర్ కన్నీటిపర్యంతమయ్యాడు.