హిజ్రాకు పోలీసు ఉద్యోగం
కేకే.నగర్: దీర్ఘ పోరాటం అనంతరం హిజ్రా నజ్రియాకు పోలీసు ఉద్యోగం లభించింది. ఉన్నతాధికారి కావడమే తన లక్ష్యం అని ఆమె తన కోరికను వెలిబుచ్చారు. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలో గల ఎస్.దావనూర్ గ్రామానికి చెందిన రాజపాండి, శాంతమ్మాళ్ దంపతుల పెద్ద కుమారుడు జగదీశ్వరన్ (21) పరమకుడిలో గల పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నప్పుడు శరీరంలో మార్పులు కలిగాయి. దీంతో ఇంటి నుంచి వెలుపలికి వచ్చి అదే ప్రాంతంలో నివసిస్తున్న హిజ్రాలతో కలిసిపోయాడు. శస్త్ర చికిత్స ద్వారా హిజ్రాగా మారి తన పేరును నజ్రియాగా మార్చుకున్నారు. దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్న నజ్రియా తమిళనాడు యూనిఫాం సర్వీసెస్ తరఫున రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.
శరీర దారుఢ్య పోటీలో పాల్గొనడానికి రామల్థోపురం వెళ్లినప్పుడు హిజ్రా సర్టిఫికెట్ లేదని అధికారులు పోటీలకు నిరాకరించారు. అనంతరం ఆమె మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని హిజ్రా సర్టిఫికెట్‌ను, హిజ్రాల సంక్షేమ గుర్తింపు కార్డును పొందారు. అప్పటికే గడువు ముగియడంతో తనను పోటీల్లో పాల్గొనడానికి అనుమతి ఇప్పించాలని, దీనిపై అధికారులను ఆదేశాలు జారీ చేయాలని నజ్రియా మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించింది. కోర్టు అనుమతితో ఆగస్టు 24వ తేదీ పోటీల్లో పాల్గొని గెలుపొంది ఉద్యోగ నియామక ఆదేశాలను నజ్రియా సొంతం చేసుకుంది.
దీనిపై నజ్రియా మాట్లాడుతూ తాను పోలీసు పదవికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీల్లో రాత పరీక్షలకు హాజరు కానున్నట్లు అందులో ఉత్తీర్ణత సాధించి పోలీసు ఉన్నతాధికారి పదవిని సొంతం చేసుకుంటానని నజ్రియా ధీమా వ్యక్తం చేసింది. సమాజంలో హిజ్రాలకు గౌరవ మర్యాదలు లభించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆమె కోరింది.