కృష్ణుడి వేషధారణలో సభకు ఎంపీ శివప్రసాద్
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోమవారం వినూత్నంగా తన నిరసన తెలిపారు. కృష్ణుడి వేషధారణలో ఆయన లోక్సభకు హాజరయ్యారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర అట్టుడుకుతుందని పద్యాల ద్వారా సభకు తెలియ చేశానన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని కళారూపం ద్వారా సోనియాగాంధీకి వివరించాలని కృష్ణుడి వేషంలో సభకు హాజరైనట్లు తెలిపారు.
టీడీపీ మరో ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పక్షాలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని కొనకళ్ల మండిపడ్డారు. కాగా రాజ్యసభలో టీడీపీ ఎంపీల నిరసన కొనసాగుతోంది. స్పీకర్ పోడియం వద్ద నిలబడి ఎంపీలు హరికృష్ణ, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన తెలియ చేస్తున్నారు.