పండగ చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు
లార్డ్స్: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విభిన్నంగా విజయోత్సవం జరుపుకుంది. లార్డ్స్ మైదానంలో 20 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ లో గెలవడంతో పాక్ క్రికెటర్ల సంబరాలు మిన్నంటాయి. పాకిస్థాన్ ప్లేయర్లు ఐదేసి పుష్-అప్లు తీశారు. జాతీయ గీతం పడుతూ తమ జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు.
ఆదివారం ఇక్కడ ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ 75 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ ఆటగాళ్లందరినీ ఒక్కచోటుకు చేర్చి ఈ విన్యాసాలు చేయించాడు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుష్-అప్ లు తీశాడు. లార్డ్స్ మైదానంలో తొలి సెంచరీ సాధించడంతో తన ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌పై సెంచరీ చేసిన ప్రతిసారి పుష్-అప్లు తీస్తానని పాకిస్థాన్ సైన్యానికి ప్రమాణం చేసినట్టు మిస్బా వెల్లడించాడు. మ్యాచ్ లో విజయం సాధించడంతో సహచరులు కూడా అదేవిధంగా హర్షాతిరేకాలు తెలిపారు.