ఆరుగాలం కష్టం..‘అకాల’నష్టం
రఘునాథపాలెం, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టం అకాల వర్షార్పణమైంది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలితో వర్షం రావడంతో రఘునాథపాలెం మండల రైతులు భారీగా పంటలు నష్టపోయారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈదురుగాలి మొదలవగా రాత్రి 8 గంటల నుంచి వర్షం మొదలైంది. రాత్రి 10 గంటల వరకు ఈదురుగాలులు, వర్షం కొనసాగింది. చేతికొచ్చిన పంటలు ఈ అకాలముప్పునకు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మునగ, బొప్పాయి తోటలు విరిగి పోయాయి. వారంరోజుల్లో కోసి మార్కెట్‌కు తరలించాల్సిన మామిడికాయలు నేలరాలాయి. కల్లాల్లో ఉన్న మిరప, వరి పంటలు వర్షానికి తడిసిపోయాయి.
కోసి పొలాల్లో ఉంచిన వరి పనలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి విద్యుత్‌వైర్లపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల ప్రజలు ఆదివారం రాత్రంతా చీకట్లోనే మగ్గాల్సి వచ్చింది. సోమవారం విద్యుత్‌శాఖ సిబ్బంది లైన్లను క్లియర్ చేసి సరఫరాను పునరుద్ధరించారు. మల్లేపల్లి, చింతగుర్తి, గణేశ్వరం, బూడిదంపాడు, కోర్రాతండా, హరియాతండా, పుటానీతండా, సూర్యాతండా, రాంక్యాతండా, రఘునాథపాలెం, చిమ్మపుడి, కోయచెలక, మంచుకొండ, ఈర్లపుడి, పంగిడి, మూలగూడెం, రాములుతండా తదితర గ్రామాల్లో బొప్పాయి, మునగ, మామిడి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. రైతుల వద్ద మామిడి తోటలు లీజుకు తీసుకున్న వ్యాపారులు ఒకేసారి పంటమొత్తం నేలరాలడంతో డబ్బులు సక్రమంగా చెల్లించే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు కూడా తీరని నష్టం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.
రఘునాథపాలెంలో ఉప్పలయ్య, బోడా కృష్ణ అనే రైతులకు చెందిన 15 ఎకరాల మామిడితోటలో కాయలు నేలరాలాయి. రూ.4 లక్షలకు రైతుల వద్ద పంటను కొనుగోలు చేసిన వ్యాపారులు అందులో సగం కూడా వచ్చేపరిస్థితి లేదని వాపోతున్నా రు. కల్లాల్లో ఉన్న మిరపకాయలు, ధా న్యం రాశులపైన పట్టాలు కప్పినా నీరు రాసుల కిందకు చేరడంతో పంటదెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. తడిసిన పంటను సోమవారం ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
చింతగుర్తిలో తుమ్మలపల్లి నర్సింహారావు అనే రైతు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మునగ సాగు చేశారు. సుమారు లక్ష వరకు పెట్టుబడులు పెట్టాడు. అకాలవర్షం ధాటికి పంటదెబ్బతినడంతో ఆ రైతు దిక్కుతోచనిస్థితిలో ఉన్నాడు. మం డలంలో దెబ్బతిన్న మునగ, మామిడి, బొప్పాయి తోటలను ఉద్యానవన అధికారులు మరియన్న, సత్యనారాయణ, మంచుకొండ సొసైటీ చైర్మన్ తుమ్మలపల్లి మోహన్‌రావు, చింతగుర్తి సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్ తాత వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఈదురుగాలులకు నగరశివారులోని ఖానాపురం, శ్రీనగర్‌కాలనీ, పోలీస్‌కాలనీ తదితర ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులకు అడ్డంగా పడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ లైన్లను పునరద్ధరించే పనిలో విద్యుత్‌శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
పాల్వంచలో నీటిపాలు
పాల్వంచ, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఆదివారం రాత్రి అకాలవర్షానికి నీటిపాలయ్యాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరి చేతికొస్తుందన్న దశలో వర్షంధాటికి దెబ్బతింది. పంటనీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధికారులు మాత్రం ఎక్కడా పూర్తిస్థాయిలో నష్టం జరగలేదని తెలపడం గమనార్హం. పాత పాల్వంచ, సీతారాంపట్నం, బంగారుజాల, కరకవాగు, కోడిపుంజుల వాగు, సోములగూడెం, జగన్నాథపురం, తోగ్గూడెం, నాగారం, దంతెలబోర తదితర ప్రాంతాల్లో వ ందలాది ఎకరాల రబీ వరి దెబ్బతింది. కొందరు రైతులు ఇప్పటికే వరికోయగా, మరికొందరు కోసి కుప్పలు పెట్టారు. కుప్పలు కొట్టి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన తరుణంలో వచ్చిన ఈ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చింతలచెర్వు ఆయక ట్టు కింద పాతపాల్వంచ రైతు ఖాదర్‌బాబుకు చెందిన వరి పొలం ఒకటిన్నర ఎకరం, హనుమంతురెడ్డి, శ్రీనివాసరావులకు చెందిన చెరో మూడు ఎకరాలు, నాని, దేవబత్తిని లక్ష్మయ్యలకు చెందిన చెరో ఎకరంనర, ఏటా వీరయ్యది ఎకరం, బాలాజీకి చెందిన రెండు ఎకరాల వరి దెబ్బతింది. ‘కోతలు కూడా ప్రారంభించాం. మరో నాలుగైదు రోజుల్లో కుప్పలు వేయాల్సి ఉండగా వ ర్షం నిండాముంచింది’ అని సంబంధిత ైరె తులు వాపోతున్నారు.
గాలిదుమారానికి మండలంలో మామిడితోటలు దెబ్బతిన్నాయి. శ్రీనివాసకాలనీ, యానంబైలు, నాగారం తదితర ప్రాంతాల్లో కాయలు నేలరాలి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడికాయలు కోతకోసి మార్కెట్‌కు తరలించే క్రమంలో నష్టం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.