'సమయానికి వెళ్లకుంటే వేతనం లేని సెలవే'
హైదరాబాద్ : సమయానికి కార్యాలయాలకు రాని అధికారులు, ఉద్యోగులకు వేతనం లేని సెలవుగా పరిగణించేందుకు కూడా వెనుకాడబోమని ఏపీ సాధారణ పరిపాలన శాఖ హెచ్చరించింది. సచివాలయంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రహి మంగళవారం ఈ మేరకు ఒక సర్క్యులర్ మెమో జారీ చేశారు. సచివాలయ అధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఈ మేరకు చర్యలు ప్రారంభించింది.
సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకల్లా విధుల్లో ఉండాలని, సాయంత్రం 5 గంటలకు వరకు పనిచేయాలని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ చాలా మంది పాటించడం లేదని ఆ మెమోలో స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకన్నా ముందుగానే హాజరు పట్టికలో సంతకం చేయాలని పేర్కొన్నారు. కేవలం గ్రేస్ పిరియడ్ కింద పది నిమిషాలు ఇస్తామని, 10.40 దాటితే గ్రేస్ పీరియడ్ కూడా వర్తించదని మెమోలో పేర్కొన్నారు. గ్రేస్ పీరియడ్ కాగానే సంబంధిత విభాగం ఓపీ ఇంచార్జ్ హాజరు రిజిష్టర్లను అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యుటీ కార్యదర్శికి అప్పగించాలని మెమోలో స్పష్టం చేశారు.
10.40 గంటలు తరువాత అధికారులు, ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరైతే అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి వారి సమక్షంలో హాజరు రిజిష్టర్‌లో సంతకం చేయాలని మెమోలో పేర్కొన్నారు. అలాంటి సంతకం చేసిన చోట అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి రెడ్ ఇంక్‌తో ఎల్ అనే హాజరు పట్టికలో రాయాలని పేర్కొన్నారు.