ప్రపంచవ్యాప్తంగా రాజ‘యోగం
కడప స్పోర్ట్స్: ప్రపంచ వ్యాప్తంగా నేడు యోగకు ప్రాధాన్యత పెరుగుతోందని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేకాధికారి ఎం. రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా ‘క్రీడల్లో యోగ ప్రాధాన్యత’ అన్న అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో వేళ ఏళ్ల కిందటే యోగులు, బ్రహ్మర్షులు మనకందించిన సంస్కృతి యోగ అన్నారు. మానసిక ఒత్తిడి తగ్గడానికి, చేస్తున్న రంగంలో ఉన్నతస్థానం పొందడానికి యోగ చక్కటి సాధనమన్నారు.
క్రీడాకారులు వారి క్రీడల్లో రాణించడానికి, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి యోగ తోడ్పడుతుందన్నారు. నేడు క్రీడల్లో సైతం యోగాసనాల పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇతర క్రీడలతో పాటు యోగలో కూడా క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ స్కూల్ యోగ కోచ్ డాక్టర్ ఆర్. రంగనాథ్ రెడ్డి మాట్లాడుతూ యోగసాధనకు కొంత సమయం కేటాయించడం వల్ల క్రీడాకారుల్లో ఏకాగ్రత, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనోస్థైర్యం సిద్ధిస్తుందన్నారు. అనంతరం క్రీడాకారులు యోగాలో పలు ఆసనాలు వేసి అలరించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కోచ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.