పర్వతపు అంచున నగ్నంగా ఫొటోలు.. అరెస్టు
కౌలాలంపూర్: పర్వతారోహణకు వెళ్లి శిఖరం అంచున నగ్నంగా ఫొటోలకు పోజులిస్తూ నిలుచున్న నలుగురు వ్యక్తులను మలేషియా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు కెనడియన్లు ఒక డచ్ వ్యక్తి మరోకరు బ్రిటన్కు చెందినవారు ఉన్నారు. మలేషియాకు చెందిన కినాబలు పర్వతాన్ని అక్కడ ప్రజలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవలె అక్కడ 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
అయితే, తాము పవిత్రంగా చూసే ఆ పర్వతంపైకి అంతకుముందు టూర్ పేరిట వచ్చిన కొందరు అసభ్యకరంగా బట్టలు విప్పేసి తిరగడం, శిఖరాగ్రాన్ని చేరి ఫొటోలు తీసుకోవడంవంటివి చేయడం మూలంగా దాని పవిత్రత దెబ్బతిన్నదని అందుకే భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ఇతర పర్యాటకులకు కూడా తీవ్ర ఇబ్బందులు కలిగించారని స్థానికులు ఆరోపణలు చేయడంతో పోలీసులు న్యూసెన్స్ కేసు కింద నలుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు టూరిస్టుల కోసం వెతుకుతున్నామని చెప్పారు.